BJP Telangana: బండి వ్యాఖ్యలతో బీజేపీ చీలిపోయిందా!

  • Written By:
  • Updated On - March 15, 2023 / 10:58 AM IST

లోలోపల గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు ఉన్నా తెలంగాణ బీజేపీలో క్రమక్రమంగా బహిర్గతమవుతున్నాయి. బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీ ఎంపీ అర్వింద్ ఖండించడం లాంటీవి చర్చనీయాంశమవుతున్నాయి. బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత నేతల మధ్య గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తోంది. బండికి సొంతపార్టీ నేతలే గడ్డిపెడుతున్నారు. అలాంటి వారిపై బండి వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. మొత్తమ్మీద తెలంగాణ బీజేపీలో ఎవరికి వారే హీరో అనిపించుకోడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమైంది. ఈ దశలో పార్టీలో కీలకంగా ఉంటారనుకున్న ఈటల రాజేందర్ కూడా దూరం జరిగారు.

కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షాని కోరినట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల వేళ.. చేరికల విషయంలో ఈటలతో మిగతా సీనియర్లు విభేదించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మునుగోడు పరాభవం తర్వాత బీజేపీలో చేరికలు పెద్దగా లేవు. దీంతో ఈటల కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చేరికలు లేకపోవడానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు నేతలు. ఇప్పటికే ఎంపీ అర్వింద్, విజయశాంతి, రఘునందన్, డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటివాళ్లు కూడా ఎవరికివారుగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.