KCR@AP: ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇలా!

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 11:48 AM IST

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. జనసేనానికి ఇటీవల సన్నిహితంగా కేటీఆర్ ఉంటున్నారు. ఒకటిరెండు సినిమా ఫంక్షన్లో ఇద్దరు ప్రశంసించుకున్నారు. కేసీఆర్ పాలనపై పవన్ అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు.

దీంతో కేసీఆర్ స్ధాపించే జాతీయ పార్టీకి ఏపీలో అండగా ఏ పార్టీలు ఉంటాయో పెద్ద చర్చగా మారింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి విపక్ష నేతల్ని కలిసొచ్చిన కేసీఆర్ ఇప్పటివరకూ ఏపీలో పర్యటించి రాజకీయ పార్టీల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఏపీలో కేసీఆర్ కు కలిసొచ్చే పార్టీలే లేవా ?లేకపోతే కేసీఆర్ ఎందుకు వాటికి చేరువ కాలేకపోతున్నారు? అనే ప్రశ్న వినిపిస్తుంది. సహజమిత్రుడు జగన్ జాతీయ పార్టీకి మద్దతిచ్చే పరిస్దితుల్లో లేడా? ఒక వేళ జగన్ సానుకూలంగా లేకపోతే కేసీఆర్ ఏపీలో చేతులు కలిపితే కామ్రేడ్లు, కాంగ్రెస్, జనసేన , టీడీపీ ఉన్నాయి.
ఇప్పటికే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన మూడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని రాష్ట్రంలో రాజకీయం చేసే పరిస్ధితుల్లో ఈ మూడు పార్టీలు కూడా లేవు. దీంతో బీజేపీకి ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న జనసేనతో పాటు వైసీపీ, టీడీపీ కూడా కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తున్నాయి. బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు లేకపోయినా మరే ఇతర రాష్ట్రంలో లేనంత పటిష్టంగా ఏపీలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కోటను ఛేదించడానికి కేసీఆర్ అడుగు పెడుతున్నారని తెలుస్తుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ,లెఫ్ట్ పార్టీల్ని జనం దూరం పెట్టి దశాబ్దం దాటిపోయింది. దీంతో ఈ రెండు పార్టీల్ని కేసీఆర్ దగ్గరకు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ప్రత్యామ్నాయంగా నేతల్నిప్రోత్సహించే పరిస్దితి కూడా లేదు. దీంతో కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప కేసీఆర్ కు మరో ఆప్షన్ కనిపించడం లేదు. అయితే తెలంగాణలో బీజేపీతో కూడా పోరాడుతున్న కాంగ్రెస్ ను దగ్గరకు తీసుకొని ఇరు రాష్ట్రాల్లో లాభం పొందాలని స్కెచ్ వేస్తున్నారు.
జాతీయ పార్టీని త్వరలో ప్రకటించేందుకు టీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి ముందే స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ వంటి విపక్ష నేతల్ని కలిసి వచ్చారు. కేసీఆర్ జాతీయ స్దాయిలో పార్టీ పెడితే కలిసి వచ్చేందుకు సాయం కోరారు. పొరుగున ఉన్న ఏపీలో పరిస్ధితి ఏంటన్న చర్చ . బీజేపీపై పోరు మొదలుపెట్టి దాన్ని జాతీయ స్ధాయికి విస్తరించి, ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీ పెట్టి మోడీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఏపీలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.

గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్, ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన వంటి ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి అండగా నిలుస్తున్న వేళ కేసీఆర్ అక్కడ ఏం చేయబోతున్నారనే అంశం హాట్ టాపిక్ అయింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల కేసీఆర్ సామాజిక వర్గం ఉంది. పైగా టీడీపీ కీలక లీడర్లు ఇప్పటికీ కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. సామాజిక, రాజకీయ కోణాల నుంచి చూస్తే కేసీఆర్ కు ఏపీలోనూ పట్టు ఉంది. గతంలో ఆయన ఏపీ లో అడుగుపెట్టగానే హారతులతో స్వాగతం పలికిన జనం ఉన్నారు. ఇవన్నీ గమనిస్తే త్వరలోనే ఏపీ మీద కేసీఆర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి అడుగు పడనుందని సర్వత్రా చర్చ జరుగుతుంది.