Site icon HashtagU Telugu

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం? ఆ కామెంట్స్ తరువాతే..!

Ilayaraja Imresizer

Ilayaraja Imresizer

సంగీత ప్రపంచానికి రారాజు అయిన ఇళయరాజా త్వరలో రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, వైజ్ఞానిక ప్రపంచం, ఆర్థిక రంగం.. ఈ రంగాల్లో విశేష సేవలు అందించి, వాటి పురోగతికి పరిశ్రమించిన ప్రముఖులను రాష్ట్రపతే స్వయంగా రాజ్యసభకు నామినేట్ చేస్తారు. అలా వివిధ రంగాలకు చెందినవారిలో 12 మందిని రాజ్యసభకు పంపిస్తారు. ఈ కోటాలో ఇప్పుడు ఇళయరాజాను పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం.

సుబ్రహ్మణ్యస్వామిని రాష్ట్రపతి కోటాలోనే గతంలో రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆయన పదవీకాలం త్వరలోనే పూర్తవుతుంది. అందుకే ఆ స్థానంలో ఇళయరాజాను రాజ్యసభకు పంపిస్తారని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంతో సంగీత ప్రేమికులు అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇళయరాజాకు సమున్నత గౌరవం దక్కుతుందని ఆనందపడుతున్నారు. కానీ రాజకీయ నేతలు మాత్రం ఆ కామెంట్స్ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు?

ఇళయరాజా ఈమధ్యనే అంబేద్కర్ – మోదీ అనే పుస్తకానికి ముందుమాట రాశారు. అందులో ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికెత్తేశారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ నెరవేరుస్తున్నారంటూ రాసుకొచ్చారు. ఈ మాటలు పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. ఇళయరాజా మీదా విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇళయరాజాను రాజ్యసభకు పంపించబోతున్నారన్న విషయం వెలుగుచూడడంతో అది కూడా చర్చకు దారితీసింది.

ఇళయరాజా ప్రతిభను ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. కొన్ని తరాల వారిని సంగీత ప్రపంచంలో ఓలలాడించిన మేస్ట్రో. ఆయన సంగీతానికి ఫిదా కాని వారు లేరు. అంతలా ఆయన పాటలు అలరిస్తాయి. ఇప్పటికీ చాలామంది రిలాక్స్ కావడానికి, మంచి మూడ్ తెచ్చుకోవడానికి ఇళయరాజా పాటలనే ఎక్కువగా వింటుంటారు. కానీ ఇప్పుడీ వివాదం తెరపైకి రావడంతో.. అసలేం జరుగుతోందా అన్న చర్చ మొదలైంది.