AP CM:ఫ్రస్ట్రేషన్ లో ‘జగన్’… నా వెంటుక కూడా పీకలేరు అంటూ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సహనం కోల్పోయారు. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే జగన్ ఇలా సహనం కోల్పోడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - April 9, 2022 / 07:09 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సహనం కోల్పోయారు. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే జగన్ ఇలా సహనం కోల్పోడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఏపీలో విద్యుత్‌ కోతలు మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశాయని విపక్షాలు ఆరోపించడమే కాదు… ప్రజలు కూడా నిరసనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు, ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, కల్తీ సారా మరణాలు, వివేకా హత్యపై సీబీఐ విచారణలో వెలుగుచూస్తున్న అంశాలు, దూరమవుతున్న కుటుంబ సభ్యులు, మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ సమస్యలను ఎదుర్కొంటున్నారు సీఎం జగన్. ఇవన్నీ కూడా జగన్ పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నాయని… అందుకే సహనం కోల్పోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. నిజంగా ఇదే విషయం శుక్రవారం నంద్యాల బహిరంగ సభలో స్పష్టమైంది. ‘జగనన్న వసతి దీవెన’ పథకం నిధులు జమ చేసే కార్యక్రమం కోసం శుక్రవారం నంద్యాల వచ్చిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి… స్థానిక ఎస్పీజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, మీడియాపై తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయారు.

రాష్ట్రంలో మంచి మార్పులతో పాలన జరుగుతున్న… ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పార్టీ, ఆయన దత్తపుత్రుడు, ఆయనను సమర్థించే మీడియాకు ఇవేవీ కనిపించవు. రోజుకో కట్టుకథ, రోజుకో వక్రీకరణ, రోజుకో విధంగా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ అబద్ధాలు సరిపోవని పార్లమెంట్‌ ను వేదికగా చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి బురద జల్లుతూ… ప్రభుత్వ పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీళ్లది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అవన్నీ ఏకమవుతాయి అని అన్నారు జగన్.

ముఖ్యంగా పార్లమెంట్‌ లో తమతమ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు గొప్పగా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆరాటపడతారు. ఇక్కడ దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య మీడియా ఉన్నాయి. ఇవీ మన రాష్ట్రం చేసుకొన్న కర్మలు. మన రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా.. ఇన్ని సమస్యలు, కష్టాలు ఇవేవీ నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఉన్నంతకాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ నంద్యాల సభ సాక్షిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ప్రస్తుతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.