AP Irrigation Election: నేడు ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, కేంద్రపార్టీ కార్యాలయం నుండి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా, అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, పలుచోట్ల కూటమి పార్టీలకు చెందిన వారు దాడులకు పాల్పడుతున్నారని, అభ్యర్థులకు ఎన్వోసీలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన మండిపడ్డారు.
సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్
నేడు సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలోని ఆయన స్వగృహం వద్ద పోలీసులు అతన్ని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు.
అయితే, ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న (శుక్రవారం) తన ఇంటి నుంచి వైసీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నిన్న, వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనేందుకు రైతులకు ఎన్వోసీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, వేముల తాసిల్దార్ కార్యాలయానికి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పులివెందులలోని పోలీస్ స్టేషనుకు తరలించారు.
ఈ ఘటనతో వేముల పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ పార్టీ సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించడంతో, వైసీపీ మద్దతుదారులు ఈ ఎన్నికల్లో ఎవరూ పాల్గొనడం లేదు. అయితే, ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలుగా, పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
ఈరోజు వేముల మండలంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన సాక్షి విలేకరులను పరామర్శించడానికి వెళ్లిన పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారిని అడ్డుకొని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…(1/2) pic.twitter.com/2RD1GA6mRx
— YS Avinash Reddy (@MP_YSRKADAPA) December 14, 2024
ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు: పోలీసుల భద్రతా ఏర్పాట్లు
ఈ రోజు ప్రకాశం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ విభాగంలో 342 డబ్ల్యూయూఏలు, 2.10 లక్షల మంది ఓటర్లుగా ఆయకట్టు రైతులు పాల్గొంటున్నారు. డబ్ల్యూయూఏల కోసం ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి, కాగా 17వ తేదీన డీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడతాయి.
అన్నమయ్య జిల్లాలో, నేడు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. తిరుపతి జిల్లాలో, 610 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కూడా రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడతాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.