Amazon Web Services: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పోరాటం మధ్య ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. దీనివల్ల ఈ కీలకమైన టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నష్టం వాటిల్లింది. అయితే ఈ సెంటర్ మీద ప్రత్యక్ష దాడి జరగలేదని, సమీపంలో జరిగిన డ్రోన్ లేదా మిస్సైల్ దాడుల ప్రభావం వల్ల డేటా సెంటర్‌లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని సమాచారం. దీనిపై అమెజాన్ నుండి ఇంకా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ గతంలో కూడా ఈ ప్రాంతంలోని తమ డేటా సెంటర్లు డ్రోన్ దాడులకు గురయ్యాయని కంపెనీ అంగీకరించింది.
ఇరాన్ బహిరంగ హెచ్చరిక
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకుంది. యుద్ధం ఇప్పుడు కేవలం భూమి లేదా ఆకాశానికే పరిమితం కాలేదని, డిజిటల్, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు కూడా కొత్త లక్ష్యాలుగా మారుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద అమెరికన్ కంపెనీల డేటా బేస్‌లపై అటాక్ చేస్తామని ఇరాన్ బహిరంగంగా హెచ్చరించింది. నిజానికి మార్చి 2026 ప్రారంభంలో కూడా ఇరాన్.. యూఏఈ (UAE), బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంది, దీనివల్ల అనేక ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగింది. డేటా సెంటర్లు నేటి కాలంలో ఒక దేశానికి డిజిటల్ వెన్నెముక వంటివని, వీటిపై దాడి జరిగితే బ్యాంకింగ్, ఈ-కామర్స్, ప్రభుత్వ సేవలు, సైనిక కమ్యూనికేషన్ కూడా ప్రభావితం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: 49 రోజుల్లో 5 సిరీస్‌లు.. 4 దేశాల్లో పర్యటించనున్న టీమిండియా!
హై అలర్ట్‌లో డేటా సెంటర్లు
అమెరికన్ టెక్ కంపెనీలను ఇరాన్ “శత్రువు మౌలిక సదుపాయాలు”గా పరిగణిస్తోంది. ఈ దాడి తర్వాత గల్ఫ్ ప్రాంతమంతా ఆందోళన పెరిగింది. బహ్రెయిన్, యూఏఈ, ఇతర దేశాల్లో ఉన్న డేటా సెంటర్లు ఇప్పుడు హై అలర్ట్‌లో ఉన్నాయి. టెక్ కంపెనీలు కూడా తమ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడానికి బ్యాకప్, ప్రత్యామ్నాయ సర్వర్ లొకేషన్లపై దృష్టి సారిస్తున్నాయి. రాబోయే కాలంలో యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోనుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు చమురు నిల్వలు, ఓడరేవులు, సైనిక స్థావరాలు లక్ష్యంగా ఉండగా, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వంటి డిజిటల్ వనరులు టార్గెట్‌గా మారుతున్నాయి.
