Site icon HashtagU Telugu

Ravichandran Ashwin: వన్ డౌన్ లో అశ్విన్…బెడిసి కొట్టిన ప్రయోగం

Ashwin

Ashwin

ఐపీఎల్ 15వ సీజన్ లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 37 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ దేవదత్ పడిక్కల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.

దాంతో..మూడో స్థానంలో కెప్టెన్ సంజు శాంసన్ వస్తాడని అందరూ అనుకుంటుండగా.. ఊహించని విధంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కి వచ్చాడు. అయితే 8 బంతుల్లో 8 పరుగులు చేసిన అశ్విన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒక సిక్స్ కొట్టి ఆ తర్వాత ఓవర్‌లోనే లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేసిన ప్రయోగం బోల్తా కొట్టింది. అశ్విన్ ను అవుట్ చేసిన ఫెర్గూసన్ అదే ఓవర్‌లో జోస్ బట్లర్‌ని కూడా అవుట్ చేశాడు. దాంతో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ తీవ్ర ఒత్తిడి మధ్య అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి హార్దిక్ పాండ్య చేతిలో రనౌటయ్యాడు.

దాంతో.. స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు ఒత్తిడిలో ఆఖరికి 155 రన్స్ మాత్రమే చేసింది . నిజానికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ బ్యాటింగ్ స్థానాల్లో ప్రయోగం చెయాలనుకుంటే అశ్విన్ స్థానంలో దూకుడుగా ఆడే జేమ్స్ నీషమ్‌ లేదా రియాన్ పరాగ్ ని పంపించి ఉండవచ్చు. కానీ. అనవసరపు ప్రయోగం చేసి చేజేతులా మ్యాచ్ చేజార్చుకుంది.

Exit mobile version