Site icon HashtagU Telugu

IPL 2022: మార్చి 27 నుండి ఐపీఎల్

IPL

IPL

 

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌పై సందిగ్థత వీడింది. మార్చి 27 నుండి మెగా లీగ్ షురూ కానుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఐపీఎల్ నిర్వహణ, వేదికల ఖరారు వంటి అంశాలపై ఇవాళ బీసీసీఐ సమావేశమైంది. సుదీర్ఘంగా సాగిన మీటింగ్‌లో ఫ్రాంచైజీలతో చర్చించిన బోర్డు పెద్దలు భారత్‌లోనే లీగ్ నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించారు. కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో మళ్ళీ లీగ్‌ను విదేశాల్లో నిర్వహిస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఫ్రాంచైజీలు మాత్రం లీగ్‌ను స్వదేశంలోనే జరపాలని కోరినట్టు జైషా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సారి సీజన్‌ను అభిమానులు లేకుండానే నిర్వహించనున్నారు. అలాగే లీగ్ మొత్తాన్ని ఒక రాష్ట్రానికే పరిమితం చేసే అవకాశముంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకున్నా… దాదాపుగా బోర్డు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మహారాష్ట్రలోనే మ్యాచ్‌లన్నీ నిర్వహించే అవకాశముంది. పలు వేదికల్లో లీగ్ నిర్వహిస్తే బబూల్ ఏర్పాట్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయని ఫ్రాంచైజీలు చెప్పినట్టు సమాచారం. 2021 సీజన్ ఇలాగే మధ్యలో వాయిదా పడిపోయింది. ఈ పరిస్థితి తలెత్తకుండా తక్కువ వేదికలకే సీజన్‌ను పరిమితం చేయాలని సూచించాయి. దీంతో ముంబై, పుణేల్లోనే ఈ సారి లీగ్‌ జరగనుంది. ఐపీఎల్ మెగా వేలం తర్వాత లీగ్‌ వేదికలపై బీసీసీఐ స్పష్టమైన ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.

మార్చి చివరి వారంలో 15వ సీజన్ మొదలవుతుందని ఫ్రాంచైజీలతో సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పారు. ఫ్రాంచైజీలు లీగ్‌ను భారత్‌లోనే నిర్వహించాలని కోరినట్టు చెప్పిన జైషా అప్పటికి కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే సౌతాఫ్రికాను ప్రధాన ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు సమాచారం. సఫారీ దేశంలో మ్యాచ్‌ల నిర్వహణతో పాటు సమయం భారత్‌ అభిమానులకు, టీవీ రేటింగ్స్‌కు అనుకూలంగా ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.