Site icon HashtagU Telugu

IPL 2022: మాక్స్ వెల్ వచ్చేశాడు

Maxvell

Maxvell

ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. తన పెళ్లి కారణంగా సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లు మిస్‌ అయిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఏప్రిల్‌ 5న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్‌ నాటికి సిద్ధంగా ఉంటాడని ఆర్సీబీ యాజమాన్యం వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ లో బరిలోకి దిగేందుకు మ్యాక్సీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించాడు.. అయితే ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా గ్లెన్‌ మాక్స్‌వెల్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 2021 సీజన్‌లో బెంగళూరు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ను బెంగళూరు ఫ్రాంచైజీ పట్టుబట్టి మరీ 11 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన ఆర్సీబీ జట్టు.. బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించి బోణీ కొట్టింది… ఈ క్రమంలోనే మూడో మ్యాచ్‌లో కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌, మాజీ సారథి విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ , వానిందు హసరంగా వంటి మ్యాచ్ విన్నర్లతో ఉన్న ఆర్సీబీ జట్టులో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ చేరికతో మరింత పటిష్టంగా మారనుంది. మాక్స్‌వెల్‌ ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టాడు. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను అతడు మార్చి 18న వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న మ్యాక్సీ, వినీ రామన్‌లు క్రైస్తవ, తమిళ సాంప్రదాయ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.