International Mountain Day : ఈ సృష్టి అద్భుతాలలో ఒకటైన పర్వతాలను చూస్తే మనసు సాంతం పొందుతుంది. ప్రపంచంలో అనేక ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య తల ఎత్తి నిలిచిన ఈ అద్భుతాలకు ఒక్క క్షణం మనం నమస్కరించాల్సిందే. భూమి ఉపరితలం దాదాపు 27 శాతం పర్వతాలతో నిండివుంది. అంతేకాదు, ప్రపంచ జనాభాలో 15 శాతం మంది పర్వతాల కింద జీవనంపై ఆధారపడుతున్నారు. అలాగే, ఈ పర్వత శ్రేణులు వ్యవసాయానికి అనుకూల ప్రదేశాలు. కాఫీ, టీ, కోకో, సుగంధ ద్రవ్యాలు, మూలికలు వంటి వనరులు ఇక్కడ పెరుగుతాయి. ఈ పర్వతాల ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేయడానికి అంతర్జాతీయ పర్వత దినోత్సవం ప్రత్యేకంగా కేటాయించబడింది, దీన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 11న జరుపుకుంటారు.
అంతర్జాతీయ పర్వత దినోత్సవం చరిత్ర
2001 డిసెంబర్ 11న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ పర్వత సంవత్సరాన్ని ప్రకటించారు. ఆ తర్వాత 2002లో, పర్వతాల గురించి అవగాహన పెంచడం, సమస్యలను పరిష్కరించడం వంటి ఉద్దేశాలతో ఈ సంవత్సరం గుర్తింపు పొందింది. 2003లో, డిసెంబర్ 11న మొట్టమొదటి అంతర్జాతీయ పర్వత దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి, ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం విభిన్న అంశాలతో జరుపుకుంటున్నారు.
అంతర్జాతీయ పర్వత దినోత్సవం ప్రాముఖ్యత
ప్రపంచంలోని జీవవైవిధ్యంలో సగానికి పైగా పర్వతాలలో ఉంది. స్వచ్ఛమైన గాలి, నీరు, వృక్ష సంపద పర్వతాల ప్రధాన వనరులు. ఈ ప్రాంతాలలో అనేక మంది జీవిస్తున్నప్పటికీ, వాతావరణ మార్పుల కారణంగా ఈ పర్వతాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ప్రజలలో పర్వతాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం ఈ దినోత్సవం లక్ష్యం. ఈ క్రమంలో అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.
భారతదేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరాలు
కాంచనజుంగా: భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైన శిఖరంగా 8,586 మీటర్ల ఎత్తు కలిగినది. ఇది సిక్కిం, తూర్పు నేపాల్ మధ్య సరిహద్దులో ఉంది.
కామెట్ శిఖరం: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గర్వాల్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది భారతదేశంలో మూడవ ఎత్తైన శిఖరాల్లో ఒకటి.
సాల్టోరో కాంగ్రీ శిఖరం: జమ్మూ కాశ్మీర్‌లో కారకోరం ఉపశ్రేణిలో ఉన్న ఈ శిఖరం భారతదేశంలో నాలుగవ ఎత్తైనది.
సాసర్ కాంగ్రీ శిఖరం: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన కారకోరం శ్రేణిలో ఉంది. ఇది ప్రపంచంలో 35వ ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొందింది.
నందా దేవి శిఖరం: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరం, 7,816 మీటర్ల ఎత్తు కలిగి ఉంది.
ఈ పర్వతాలను సంరక్షించడం భూమి భవిష్యత్తుకు అత్యంత కీలకం.
