Site icon HashtagU Telugu

Infants Death: ఇంక్యుబేటర్ లో ఇద్దరు పసి కందులు మృతిచెందిన ఆస్పత్రి పై కేసు.. దర్యాప్తు ముమ్మరం

infants deaths

infants deaths

ఇంక్యుబేటర్ లో ఇద్దరు పసికందులు చనిపోయిన ఘటనపై ఎట్టకేలకు పోలీసుల్లో కదలిక వచ్చింది. మంగళవారం రోజున ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకోగా.. హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీసులు గురువారం రోజున “kam multi speciality hospital” పై కేసు నమోదు చేశారు. ఇద్దరు శిశువులను కోల్పోయిన కుటుంబాల తరఫున అడ్వకేట్ మొహమ్మద్ ఘోరీ ఫలక్ నుమా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయించారు.

kam ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇద్దరు శిశువులు ఇంక్యుబేటర్ లో మృతిచెందారనే అభియోగాలతో, ipc 304(A) కింద కేసు నమోదు అయింది. చనిపోయిన ఇద్దరు శిశువులను బుధవారం ఉదయంకల్లా ఖననం చేయగా, ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ మృతదేహాలను తీయించి అక్కడికక్కడే పోలీసులు పోస్టుమార్టం చేయించారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

మృతిచెందిన పసికందుల్లో ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు ఉంది.kam ఆస్పత్రిలో ఆడ శిశువు కు జన్మనిచ్చిన వెంటనే మస్రత్ ఉన్నిసా బుతూల్ అనే మహిళ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆమెను వెంటనే మరో ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, బుధవారం రోజున జిల్లా అదనపు డీఎం అండ్ హెచ్ఓ కూడా kam ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఇంక్యుబేటర్ల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు.