Vegetable vendor’s daughter: అమ్మ, నాన్న.. ఒక సక్సెస్ ఫుల్ కూతురు !!

ఆడపిల్ల అంటే అబల కాదు .. సబల!! వారిని సబలలుగా చేసే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 01:40 PM IST

ఆడపిల్ల అంటే అబల కాదు .. సబల!! వారిని సబలలుగా చేసే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఈ బాధ్యతను నిర్వర్తించి .. దేశంలోని ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆదర్శప్రాయులుగా నిలిచారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి చెందిన అశోక్, లక్ష్మీ దంపతులు. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకోగా వచ్చే కొద్దిపాటి సంపాదనను ధారపోసి చదివించి .. కూతురిని జడ్జి చేశారు. ఔను.. అశోక్, లక్ష్మీ దంపతుల కుమార్తె అంకిత నాగర్ ఇటీవల జడ్జి పోస్టుకు ఎంపికైంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బాగా చదువుకోవాలనే పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. కుటుంబంలో జడ్జి నేపథ్యం ఉన్నవాళ్లు ఒక్కరు కూడా లేరు. అయినా అంకిత.. సెల్ఫ్ మోటివేషన్ తో చదువుకుంది. వాస్తవానికి ఆమె చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది.

ఎంబీబీఎస్ చదవాలంటే.. బాగా డబ్బులు కావాలి. కానీ తన తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేదు. దీంతో తక్కువ ఖర్చులో పూర్తయ్యే ఎల్ఎల్బీ కోర్సు చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్ లో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసి, అన్ని దశల్లోనూ అత్యుత్తమ మార్కులతో విజయం సాధించింది. కూతురు అంకిత జడ్జి అయ్యిందనే శుభవార్త విని.. అశోక్, లక్ష్మీ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ కూతురు ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా కూరగాయలు అమ్మడంలో చేదోడుగా ఉండేదని అశోక్, లక్ష్మీ దంపతులు గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ‘

మాకు ముగ్గురు పిల్లలు. అంకిత పెద్ద కూతురు. చిన్న కూతురికి ఇప్పటికే పెళ్లి చేశాం.ఒక కొడుకు ఎంబీఏ పూర్తి చేశాడు. పిల్లలను చదివించే క్రమంలో మేం ఆడ,మగ అనే తారతమ్యాన్ని ఎన్నడూ చూపలేదు. అందువల్లే అంకిత జడ్జి కాగలిగింది’ అని వారు వివరించారు. అంకిత మాట్లాడుతూ.. ‘ మా అమ్మానాన్న నన్ను చదివించేందుకు పడిన శ్రమ వల్లే ఈవిజయం సాధ్యమైంది. ఎన్ని ఆర్ధిక సమస్యలు వచ్చినా వాళ్ళు నా చదువును ఆపలేదు. చదువును ఆపొద్దు బిడ్డ అని ధైర్యం చెప్పారు ‘ అని చెప్పుకొచ్చింది.