IndiGo: లక్నో విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పైలట్ అత్యవసర బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 151 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడి భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం టేకాఫ్ అవ్వలేదు. టేకాఫ్ అవుతున్న సమయంలోనే అత్యవసర బ్రేకులు వేయడంతో రన్‌వేపైనే నిలిచిపోయింది. తర్వాత ప్రయాణికులను అత్యవసర గేటు ద్వారా సురక్షితంగా బయటకు తీశారు.
సాంకేతిక లోపంతో ఆగిపోయిన విమానం
సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ కోసం సిద్ధంగా రన్‌వేపై వేగంగా ముందుకు వెళ్లింది. అయితే విమానం టేకాఫ్ అవ్వలేదు. ఇది గమనించిన పైలట్ వెంటనే రన్‌వే చివరి అంచుకు చేరుకోగానే అత్యవసర బ్రేకులు వేశారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. ప్లేన్ ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలో ఢిల్లీకి పంపించారు. మొత్తం 151 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
Also Read: Gautam Gambhir: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. కోచ్ గంభీర్ స్పందన ఇదే!
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం
ఈ సంవత్సరం భారతదేశంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. 2025 జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానం కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడింది. దీంతో విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. హాస్టల్లో లంచ్ చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు, సాధారణ ప్రజలు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.
ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. విమానం కిందపడే సమయంలో కిటికీ పగిలి అతను బయట పడిపోయాడు. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. విమానం కూలినప్పటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విమాన ప్రమాదం భారతదేశంతో సహా ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్-737 డ్రీమ్‌లైన్. ప్రమాదం తర్వాత సంస్థపై ప్రశ్నలు తలెత్తాయి. విచారణ నివేదికలో విమానం కూలడానికి కారణం ‘ఫ్యూయల్ స్విచ్’ హఠాత్తుగా ‘రన్’ నుంచి ‘ఆఫ్’ మోడ్‌కు మారడమేనని తేలింది.