Site icon HashtagU Telugu

Guwahati Airport: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?

Guwahati Airport

Guwahati Airport

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారు. టెక్నికల్ సమస్యలు, అలాగే ఇతర కారణాలవల్ల ఫ్లైట్లను ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఇటువంటి ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యల కారణంగా అనూహ్యంగా అత్యవసరంగా ల్యాండ్‌ అయింది.

ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి రామేశ్వర్‌ తెలి, మరో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని గువహాటి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇదే విషయంపై మీడియాతో టెలిఫోన్‌లో రామేశ్వర్‌ తెలి మాట్లాడారు. నేను భాజపా ఎమ్మెల్యే ప్రశాంత్‌, తెరస్‌ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరాను. నాకు దులియాజన్‌, టింగ్‌ఖాంగ్‌, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది.

మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లో ఉన్న తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేము సురక్షితంగా ఉన్నాము. మా విమానం నేడు మరోసారి గాల్లోకి ఎగరదని విమానాశ్రయ అధికారులు చెప్పారు అని చెప్పుకొచ్చారు రామేశ్వర్‌. మరోవైపు దిబ్రూగఢ్‌ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయాన్ని గువాహటి ఎయిర్‌ పోర్టు వర్గాలు కూడా ధ్రువీకరించాయి. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది.