Green Growth: గ్రీన్ గ్రోత్ దిశగా భారత్ అడుగులు.. బడ్జెట్‎లో భారీ కేటాయింపులు!

మన మనుగడకు ప్రకృతి ఆధారం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాల వల్ల ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 08:27 PM IST

Green Growth: మన మనుగడకు ప్రకృతి ఆధారం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాల వల్ల ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు రానున్న రోజుల్లో విపత్తులకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణ హితంగా మన అభివృద్ధి ఉండాలని భారత్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందుకే ఈసారి బడ్జెట్ లో గ్రీన్ గ్రోత్ ను ప్రాధాన్య అంశం కింద తీసుకొని, దానికి భారీగా నిధులు కేటాయించడం జరిగింది.

పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఏడు ప్రాధాన్యాంశాలతో కూడిన సప్తర్షి రీతిన బడ్జెట్ ను దేశానికి అందించారు. అందులో గ్రీన్ గ్రోత్ కు పెద్ద పీట వేస్తూ భారీగా నిధులను కూడా కేటాయించారు. 2070కి శూన్య ఉద్గారాలకు చేరాలని లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే ఈ బడ్జెట్ లో భారీ కేటాయింపులు అని నిర్మలా సీతారామన్ వివరించారు.

2023-24 బడ్జెట్ లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూ.19700కోట్లు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థను కర్బన రహితంగా మార్చేందుకు, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఈ మిషన్ సహకరిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 2030 నాటికి ఏడాదికి 500 మిలియన్ల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మరోపక్కన గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం పేరుతో సంస్థలు, వ్యక్తులు, స్థానిక సంస్థల పర్యావరణ హితమైన చర్యలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పర్యావరణ స్థిరత్వం కోసం పాటుపడే వారికి అదనపు వనరులు సమీకరించడంలో సహకారం అందిస్తామన్నారు. అదే సమయంలో పాత కాలుష్య వాహనాలను వదిలించుకోవాల్సిందే అన్న ఆమె.. 2021-22 బడ్జెట్ లో ప్రకటించిన వాహనాల తుక్కు విధానం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు నిధులు కేటాయించారు. ఇక రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో తమ సహకారం అందిస్తామన్నారు.