World Cup: మహిళల ప్రపంచకప్ లో భారత్ జోరు

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయాన్నందుకుంది.

Published By: HashtagU Telugu Desk
Odi

Odi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయాన్నందుకుంది. వెస్టిండీస్ మహిళలతో జరిగిన మ్యాచ్ లో 155 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హిట్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) సెంచరీలతో కదం తొక్కారు. ఒక దశలో 78 పరుగులకే3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును స్మ‌తి మంధాన, హర్మన్ ప్రీత్ ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో
వికెట్‌కు 184 పరుగులు జోడించారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్నేహ్ రాణా(3/22) బంతితో తీన్మార్ వేయడంతో 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్యచేధనలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన విండీస్.. 12 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసి భారత బౌలర్లను బెంబేలెత్తించింది. వీరి ఆరంభం చూసి విండీస్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ డాటిన్‌ను ఔట్ చేసి స్నేహ్ రాణా మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆమెకు తోడుగా మేఘన సింగ్ రెండు వికెట్లు తీయగా.. జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీశారు.దీంతో విండీస్ 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

  Last Updated: 12 Mar 2022, 11:09 PM IST