Australia All Out: భారత్ బౌలర్లు విజృంభణ.. 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!

ఆస్ట్రేలియా టీమ్ కనీసం మూడు సెషన్లు కూడా బ్యాటింగ్ చేయలేక 263 పరుగులకి ఆలౌటైంది.

  • Written By:
  • Updated On - February 17, 2023 / 05:00 PM IST

ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బౌలర్లు విజృంభించారు. దాంతో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ కనీసం మూడు సెషన్లు కూడా బ్యాటింగ్ చేయలేక 263 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81: 125 బంతుల్లో 12×4, 1×6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలానే పీటర్ హ్యాండ్స్‌కబ్ (72 నాటౌట్: 142 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీ సాధించి చివరి వరకూ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. గత వారం నాగ్‌పూర్ టెస్టులో ఫెయిలైన డేవిడ్ వార్నర్ (15: 44 బంతుల్లో 3×4) ఈరోజు కాసేపు పట్టుదలతో క్రీజులో నిలిచాడు. కానీ.. మహ్మద్ షమీ మరోసారి రౌండ్ ది వికెట్ ప్లాన్‌తో అతడ్ని మళ్లీ బోల్తా కొట్టించేశాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ లబుషేన్ (18: 25 బంతుల్లో 4×4), స్టీవ్‌స్మిత్ (0: 2 బంతుల్లో)లను బంతి వ్యవధిలోనే రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టించేశాడు. అలానే ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ట్రావిస్ హెడ్ (12: 30 బంతుల్లో 1×4, 1×6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ 108/4తో ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత బ్యాట్స్ మెన్ కూడా రాణించలేకపోవడంతో ఆసీస్ తక్కువ పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.