Site icon HashtagU Telugu

Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ కౌర్ పై ఐసీసీ సస్పెన్షన్ వేటు

Harmanpreet Kaur

Harmanpreet Kaur

ఊహించిందే జరిగింది…గ్రౌండ్ లో అనుచిత ప్రవర్తన చేసినందుకు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మూల్యం చెల్లించుకుంది. ఆమెపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండు మ్యాచ్ లు ఆడకుండా సస్పెన్షన్ వేటు వేసింది. అసలేం జరిగిందంటే…భారత్ , బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో వన్డే టై గా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ చివరి నాలుగు ఓవర్లలో 14 పరుగులు చేయలేక చతికిలపడింది. దీంతో సిరీస్ 1-1 గా ముగిసింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ తనను అవుట్ గా ప్రకటించినందుకు అంపైర్ మీద అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా బ్యాట్ తో వికెట్లను పడగొట్టింది.

ఇక ఔటై పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో అంపైర్ పై నోరు పారేసుకుంది. మ్యాచ్ అనంతరం అంపైరింగ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ పలు అంపైరింగ్ నిర్ణయాలు నమ్మశక్యంగా లేవనీ, అవి దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మరోసారి బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చేటపుడు వీటన్నింటినీ గుర్తుంచుకుని దానికి తగ్గట్లుగా సన్నద్ధమవుతామంటూ వ్యంగ్యంగా మాట్లాడింది.

ఇంతటితో ఆగకుండా సిరీస్ ట్రోఫీతో ఇరు జట్లతో జరిగిన ఫోటో సెషన్ లో బంగ్లాదేశ్ టీమ్‌ మీద కౌర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ట్రోఫీని అందుకుని ప్రదర్శిస్తుండగా, అంపైర్లు కూడా రావాలి అన్నట్లుగా వారిని పిలిచింది. దీనిపై బంగ్లాదేశ్ టీమ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసి డ్రెస్సింగ్ రూంకి వెళ్ళిపోయింది. కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొడుతూ జట్టుని ముందుకు నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు మాజీ ఆటగాళ్లు కూడా మండిపడ్డారు. భారత మాజీ క్రికెటర్ మదనలాల్ హర్మన్ చేసిన పనిని తప్పు పట్టాడు. ఆమె భారత క్రికెట్ పరువు తీసిందని సస్పెండ్ చేయాలని కోరాడు. తాజాగా ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో ఆమె ఆసియా క్రీడల్లో తొలి మ్యాచ్‌లకు దూరం కానుంది. దీంతో స్మృతి మందనకి కెప్టెన్సీ అవకాశం దక్కింది.