Site icon HashtagU Telugu

Women’s World Cup: మహిళల ప్రపంచకప్‌లో భారత్ బోణీ

Indianwomen Imresizer (1)

Indianwomen Imresizer (1)

మహిళల ప్రపంచకప్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభవానికి మిథాలీసేన ప్రతీకారం తీర్చుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ తడబడి నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు పాక్ బౌలర్లు షాకిచ్చారు. డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మను డకౌట్ చేయడంతో శుభారంభం దక్కలేదు.

అయితే దీప్తి శర్మ , మంధాన ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. 92 పరుగుల పార్టనర్‌షిప్‌కు కూడా బ్రేక్ పడడంతో పాక్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. దీంతో భారత్ 18 పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ మంచి స్కోర్ సాధించిందంటే పూజా , స్నేహా రాణాలే కారణం. నిలకడగా ఆడిన వీరిద్దరూ 122 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లపై ఆధిపత్యం కనబిరిచిన వీరిద్దరి జోరుతో చివరి 10 ఓవర్లలో భారత్ 84 పరుగులు సాధించింది. దీంతో భారత్ 50 ఓవర్లలో 244 పరుగులు చేసింది. స్నేహా రాణా53 పరుగులతో నాటౌట్‌గా నిలస్తే… పూజ 67 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ మహిళల జట్టు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. 11 ఓవర్ నుండీ పాక్ పతనం ఆరంభమైంది. ఓపెర్లతో పాటు మిడిలార్డర్‌లో ఏ ఒక్కరినీ భారత బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. ముఖ్యంగా రాజేశ్వరీ గైక్వాడ్ తన స్పిన్ మ్యాజిక్‌తో పాక్‌ పతనాన్ని శాసించింది. మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో పాక్ ఇన్నింగ్స్‌కు 137 పరుగులకే తెరపడింది. రాజేశ్వరి 4 , ఝులన్ గోస్వామి , స్నేహా రాణా రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో ఓవరాల్‌గా భారత్ పాక్‌పై తన 100 శాతం గెలుపు రికార్డును కొనసాగించినట్టైంది. భారత్ మహిళల జట్టుకు పలువురు మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాతి మ్యాచ్‌లో మిథాలీసేన వెస్టిండీస్‌తో తలపడుతుంది.

Pic Courtesy- BCCI/Twitter