Droupadi Murmu : భారత రాజ్యాంగం సజీవమైనది, ప్రగతిశీలమైనది. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశానికి రాజ్యాంగం కీలక మూలస్తంభమని, అది ప్రజాస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆమె చెప్పారు. రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు కూడా కీలక భాగస్వాములుగా ఉన్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో దేశంలో కొత్త శకం ప్రారంభమైందని, ఇది మహిళా సాధికారతకు దోహదపడుతుందని అన్నారు. రాజ్యాంగానికి మార్గనిర్దేశకులైన రాజేంద్రప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి ఉటంకించారు.
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ప్రత్యేక ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రసంగించారు. అనంతరం, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పార్లమెంట్ సభ్యులందరూ రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు. ఈ సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలు, 75 వసంతాలను సూచించే స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. మైథిలీ, సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని నూతనంగా ప్రచురించడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Pawan Kalyan : గజేంద్ర సింగ్ షెఖావత్‌తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, రాజ్యాంగం మనకు ప్రజాస్వామ్య, గణతంత్ర విలువల ఆధారంగా స్ఫూర్తి ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రగతిశీల సూత్రాలు దేశాభివృద్ధికి పునాది వేశాయని అన్నారు. గత కొన్నేళ్లలో బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలు ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాయని రాష్ట్రపతి గుర్తుచేశారు. విద్యుత్తు, తాగునీరు, రోడ్డు సదుపాయాలతో పాటు వైద్య సేవలు అందుబాటులోకి రావడం, పేదల ఇళ్ల కల నెరవేరడం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ వ్యాఖ్యలు:
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ, వ్యక్తిగత విశ్వాసాలను దేశానికి మించిన స్థాయిలో ప్రాముఖ్యత ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. గందరగోళాన్ని వ్యూహంగా అమలు చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలు ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను కాపాడుతాయని ధన్‌ఖడ్ తెలిపారు.
లోక్‌సభ స్పీకర్ సందేశం:
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, 75 ఏళ్ల క్రితం రాజ్యాంగం ఆమోదించిన సందర్భంలో రాజ్యాంగ సభ అనుసరించిన గౌరవప్రదమైన చర్చల సంప్రదాయాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారత రాజ్యాంగ పట్ల గౌరవం వ్యక్తం చేయడమే కాకుండా, దాని విలువలను మరోసారి గుర్తుచేసుకుంది. 75వ రాజ్యాంగ దినోత్సవం, సమగ్ర అభివృద్ధి పట్ల దేశం చేసిన కృషికి ఓ పునరుజ్జీవనం వంటి ప్రత్యేక సందర్భంగా నిలిచింది.
CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు