Site icon HashtagU Telugu

3rd ODI: భారత్ పరువు దక్కేనా…?

Team India Cricket

Team India Cricket

దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.తొలిరెండు వ‌న్డేల్లో జ‌రిగిన త‌ప్పుల‌ను ఈ మ్యాచ్‌లో పున‌రావృతం చేయ‌కూడ‌ద‌ని భావిస్తోంది.

ముఖ్యంగా బ్యాటింగ్‌లో మిడిలార్డ‌ర్ రాణించాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. తొలి వ‌న్డేలో టాపార్డ‌ర్ రాణించిన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్ చేతులెత్తేయ‌డంతో భార‌త్ ఓట‌మి పాలైంది. అలాగే రెండో వన్డేలో రిషబ్ పంత్‌ మినహా తేలిపోయిన బ్యాటింగ్‌తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితమవగా… ఆపై బౌలింగ్‌ పూర్తిగా నిరాశపరచింది. పేలవ బౌలింగ్ తో ఒకదశలో వికెట్‌ తీయడమే గగనంగా మారిపోయింది.

అందుకే ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో జట్టు సమష్టిగా రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక ఏముందో వన్డేలో బరిలోకి దిగే భారత తుది జ‌ట్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ ప‌లు మార్పులు చేసే అవ‌కాశం ఉంది. బెంచ్‌లో ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్‌ని జ‌ట్టులోకి తీసుకునే ఆలోచ‌న‌ను కూడా చేస్తోంది. అదే జ‌రిగితే శ్రేయ‌స్ అయ్య‌ర్ పై వేటు పడొచ్చు. అటు రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికర అంశం. ఇక బౌలింగ్‌లో ప‌లు మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

తొలి రెండు వన్డేల్లో ప‌రుగులు ఎక్కువ‌గా ఇచ్చిన సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ స్థానంలో యువ పేస‌ర్ ప్రసాద్ క్రిష్ణ జ‌ట్టులోకివ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే తొలి రెండు వ‌న్డేల్లో విఫ‌ల‌మైన‌ స్పిన్న‌ర్‌అశ్విన్ స్థానంలో జ‌యంత్ యాద‌వ్‌ను జ‌ట్టులో తీసుకోవ‌చ్చు. ఇకవిరామం లేకుండా మ్యాచులు ఆడుతున్న సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ లో విశ్రాంతినిస్తే మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రానున్నాడు.

Cover Pic Courtesy- BCCI/Twitter