India vs Bangladesh: వన్డే సిరీస్ బంగ్లాదే.. టీమిండియాపై విజయం

  • Written By:
  • Updated On - December 7, 2022 / 08:48 PM IST

మ్యాచ్ అంటే ఇది.. ఆధిపత్యం చేతులు మారుతూ.. ఓవర్ ఓవర్ కూ సమీకరణాలు మారుతూ అభిమానులకు అసలయిన క్రికెట్ మజా అందించింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ మరోసారి సత్తా చాటిన వేళ భారత్ వన్డే సిరీస్ లో పరాజయం పాలైంది. బౌలర్లు చివర్లో చేతులేత్తేయడం.. బ్యాటర్లు విఫలమవడంతో భారత్ కు రెండో వన్డేలో ఓటమి తప్పలేదు. చివరికి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ సైతం క్రీజులోకి వచ్చి గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది అయితే భారత బౌలర్ల విజృంభణతో టాప్‌, మిడిలార్డర్‌ కుప్పకూలింది. కేవలం 69 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల జోరు ముందు బంగ్లా కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ మెహ్‌దీ హసన్ మీర్జా మరోసారి జట్టును ఆదుకున్నాడు.మహ్మదుల్లాతో కలిసి మెహ్‌దీ హసన్ ఏడో వికెట్‌కు 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్‌ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్‌కు రెండు, సుందర్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో భారత్ డెత్ బౌలింగ్ వైఫల్యం మరోసారి కొంపముంచింది. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మన బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. గత మ్యాచ్ లో భారత్ ఓటమికి కారణమయిన మేహది హాసన్ మరోసారి మనకు విలన్ గా మారాడు. ఫలితంగా బంగ్లా భారీ స్కోరు సాధించింది.

277 పరుగుల లక్ష్య చేధనలో భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లి వ 5 పరుగులకే క్లీన్‌ బౌల్డయ్యాడు. కాసేపటికే ధావన్‌.. ముస్తిఫిజర్‌ రెహ్మన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక్కడ నుంచి భారత్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. అయితే ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ శ్రేయస్‌ అ‍య్యర్‌ మాత్రం పోరాడాడు. ఈ క్రమంలో తన హాఫ్‌ సెంచరీని కూడా అయ్యర్‌ పూర్తి చేసుకున్నాడు. అటు అక్షర్ పటేల్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ గెలుపుపై ఆశలు నిలిచాయి. అయితే శ్రేయస్‌ అ‍య్యర్‌ , అక్షర్ పటేల్ ఇద్దరూ ఔటవడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో గాయంతోనే క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ నొప్పితోనే బాధపడుతూ పోరాడాడు. సిక్సర్లు కొడుతూ మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశాడు. అయితే 47 వ ఓవర్లో సిరాజ్ ఒక్క సింగిల్ కూడా తీయకపోవడంతో ఆ ఓవర్ మెయిడెన్ అయింది. తర్వాత రోహిత్ చివరి బంతి వరకూ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. భారత్ విజయం ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్‌ రెండు, ముస్తిఫిజర్‌, మహ్మదుల్లా తలా వికెట్‌ సాధించారు. మూడో వన్డే శనివారం జరుగుతుంది.

Also Read: Sehwag Son Aryavir: క్రికెట్‌లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ..!

టీమిండియా (Team india)పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ లో ఓ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అనముల్ హక్‌ను ఔట్ చేసి ఈ ఏడాది వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 2022లో సిరాజ్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి.. 23 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 14 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు.