Australia All Out: సత్తా చాటిన భారత బౌలర్లు.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్!

తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది.

  • Written By:
  • Updated On - March 17, 2023 / 05:46 PM IST

ముంబయిలోని వాంఖడే వేదికగా శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు ఇన్నింగ్స్ 20వ ఓవర్ నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఎంతలా అంటే? ఒకానొక దశలో 128/2తో ఉన్న ఆస్ట్రేలియా టీమ్ చివరికి 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అలానే రవీంద్ర జడేజాకి రెండు, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్‌కి ఒక్కో వికెట్ దక్కింది.

ఫ్యామిలీ రీజన్స్‌తో ఈ వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దాంతో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి.. ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే.. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5) ఆరంభంలోనే సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డవగా.. అనంతరం వచ్చిన స్టీవ్‌స్మిత్ (22), మార్కస్ లబుషేన్ (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

కానీ.. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మిచెల్ మార్ష్ (81: 65 బంతుల్లో 10×4, 5×6) దూకుడుగా ఆడేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటంతో తక్కవ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా ఆసీస్ 200 పరుగుల లోపే ఆలౌట్ అయ్యింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో విరాట్ కోహ్లీ తోటి ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ జోష్ నింపాడు. అయితే ఆస్ట్రేలియా వికెట్ పడిన సందర్భంలో విరాట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం అందర్నీ ఆకట్టుకుంది.