Site icon HashtagU Telugu

MQ-9B Drones : ఇండియా ఆర్మీకి మిస్సైల్స్ మోసుకెళ్లే 30 డ్రోన్లు..విశేషాలివీ

Mq 9b Drones

Mq 9b Drones

MQ-9B Drones : ఇప్పటివరకు మనదేశం దగ్గర సాయుధ మిస్సైల్స్ ఉన్నాయి.. 

కానీ సాయుధ డ్రోన్స్ లేవు.. 

ఆ లోటు తీరిపోయే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు.. 

అమెరికా నుంచి 30 “MQ-9B సీ గార్డియన్” సాయుధ డ్రోన్‌లను కొనేందుకు భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వీటికి “హంటర్ కిల్లర్” డ్రోన్ అనే పేరు కూడా ఉంది.   

వీటిలో చెరో 8 హంటర్ కిల్లర్ డ్రోన్లను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ లకు.. 14 డ్రోన్లకు నేవీకి అందిస్తారు..

ఈ డీల్ విలువ రూ.24వేల కోట్లు.. ఈ డ్రోన్ల గురించి ఆసక్తికర వివరాలివీ.. 

ఈ డ్రోన్లతో ఇండియా ఏం చేస్తుంది ?

ప్రధానంగా 2 కారణాల వల్ల “MQ-9B సీ గార్డియన్” సాయుధ డ్రోన్‌లను(MQ-9B Drones) ఇండియా కొంటోంది. మొదటి కారణం.. LAC పక్కనే ఉన్న ప్రాంతంలో చైనా  సైన్యం యాక్టివిటీపై నిఘా పెట్టేందుకు. రెండో కారణం.. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికుల చొరబాట్లను ఆపేందుకు. ఈ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే.. రానున్న రోజుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరిన్ని  సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు ఇండియా సమాయత్తం అవుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి భారత సైన్యం బార్డర్ లో నిఘా కార్యకలాపాల కోసం ఇజ్రాయెల్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది.

అమెరికా ఈ డ్రోన్లు ఇండియాకు ఎందుకు ఇస్తోంది ?

క్వాడ్ (QUAD) కూటమిలో  భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఈ కూటమి ఏర్పడింది. ఇందులో ఉన్న దేశాలన్నీ “MQ-9B సీ గార్డియన్” డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా వీటిని వినియోగించనుంది. తనకు సవాల్ గా మారిన రష్యా మిత్రదేశం  చైనా కు చెక్ పెట్టేందుకే ఈ డ్రోన్లను ఇండియాకు అమెరికా ఇస్తోంది.  వాస్తవానికి 2020లోనే భారత నౌకాదళం సముద్ర సరిహద్దు పర్యవేక్షణ కోసం “MQ-9B సీ గార్డియన్” డ్రోన్లను ఒక సంవత్సరానికి లీజుకు తీసుకుంది. తర్వాత లీజు సమయాన్ని పొడిగించారు. అమెరికా మిత్రదేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, UK, UAE, తైవాన్, మొరాకో కూడా వీటిని ఉపయోగిస్తున్నాయి.

Also read :US Army: అమెరికాలో దారుణం.. యజమాని పైనే తిరగబడిన డ్రోన్.. చివరికి?

ఈ డ్రోన్ మనకు ఎందుకు అవసరం ?

  • “MQ-9B సీ గార్డియన్” సాయుధ డ్రోన్ ను ఇప్పుడు భారతదేశానికి రక్షణ అవసరంగా పరిగణిస్తున్నారు.
  • చైనా, పాకిస్థాన్ దేశాల డ్రోన్లను మన సరిహద్దులకు దూరంగా ఉంచేందుకు ఇలాంటి డ్రోన్ల ఆవశ్యకత ఉందని నిపుణులు చెబుతున్నారు.
  • పాకిస్థాన్‌కు చైనా ఇచ్చిన డ్రోన్ గంటకు 370 కి.మీ వేగంతో 20 గంటల పాటు ఎగరగలదు. దీనితో పోలిస్తే MQ-9B  30 గంటల పాటు ఎగురగలదు. అందుకే వీటిని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు ఇండియా అందించనుంది.
  • ఈ డ్రోన్ 2721 కిలోల బరువైన క్షిపణులతో గాల్లోకి ఎగరగలదు. 40 వేల అడుగులకు పైగా ఎత్తులో ఇది ఎగురగలదు.
  • ఇందులో రెండు లేజర్ గైడెడ్ AGM-114 హెల్‌ఫైర్ క్షిపణులను అమర్చవచ్చు.
  • ఈ డ్రోన్‌లో మారిటైమ్ రాడార్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్స్, సెల్ఫ్ కంటెయిన్డ్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కిట్ ఉన్నాయి.
  • గూఢచర్యం, నిఘా, సమాచార సేకరణతో పాటు ఎయిర్ సపోర్ట్, రెస్క్యూ ఆపరేషన్స్, అటాక్‌లను ఆపడం వంటి పనులన్నీ ఈ డ్రోన్ చేస్తుంది.
  • శాటిలైట్స్ తో కనెక్ట్ అయి ఈ డ్రోన్స్ పనిచేయగలవు.
  • MQ-9B సీ గార్డియన్ డ్రోన్ లో రాడార్ వంటి సెన్సర్లు కూడా  ఉంటాయి. ఇది ఏ శత్రువునైనా గుర్తించగల ఎలక్ట్రానిక్ మద్దతు కోసం పరికరాలను కలిగి ఉంది.
  • ఈ డ్రోన్‌లో అమర్చిన క్షిపణులు, బాంబుల సహాయంతో లక్ష్యాలను నాశనం చేయొచ్చు.
  • ఈ డ్రోన్‌లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ పరిస్థితిలోనైనా పనిచేస్తాయి.
  • ఇవి నిఘా సమయంలో ఫుల్-మోషన్ వీడియోను తీసి అందిస్తాయి.

ఈ డ్రోన్‌తోనే అల్ జవహరిని హతమార్చారు.. లాడెన్ పై నిఘా పెట్టారు  

2022 జూలై 31న కాబూల్‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ అల్ ఖైదా టెర్రరిస్ట్ అల్ జవహరి హతమయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  ఈ దాడి గురించి ఆఫ్ఘనిస్తాన్ కు గానీ.. మరే ఇతర దేశానికి గానీ తెలియదు. ఈ రహస్య దాడిని అమెరికాకు చెందిన MQ-9B రీపర్ డ్రోన్ నిర్వహించింది. ఈ డ్రోన్‌తో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను కూడా అమెరికా పర్యవేక్షించింది. దీని తర్వాతే అమెరికన్ నేవీ సీల్స్ బలగాలు రంగంలోకి దిగి..  2011 మే 2న పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో లాడెన్‌ను హతమార్చాయి. యుద్ధ సమయాల్లో  ఇరాక్, సోమాలియా, యెమెన్, లిబియా, సిరియాలో కూడా అమెరికా ఈ  డ్రోన్‌లు మోహరించింది. 2020 జనవరి 3న ఈ డ్రోన్‌తో జరిపిన  వైమానిక దాడిలో ఇరాన్ యొక్క అల్-ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఖాసిమ్ సులేమానిని అమెరికా హతమార్చింది. ఈ డ్రోన్.. ఖాసిమ్ సులేమాని కాన్వాయ్ లోని రెండు కార్లపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అతడిని చంపేసింది. ఈ డ్రోన్ ద్వారా ప్రయోగించే క్షిపణుల పేరు హెల్‌ఫైర్ R9X క్షిపణులు. వీటిని నింజా అని కూడా పిలుస్తారు.