No Surgical Strike : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ పై మరో సర్జికల్ స్ట్రైక్.. ? ఖండించిన భారత్

No Surgical Strike :  పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసిందంటూ వ్యాపించిన వదంతులపై భారత రక్షణ శాఖ మంగళవారం స్పందించింది. అవన్నీ అబద్ధాలని, సర్జికల్ స్ట్రైక్ చేయలేదని స్పష్టం చేసింది.

  • Written By:
  • Updated On - August 22, 2023 / 09:54 AM IST

No Surgical Strike :  పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసిందంటూ వ్యాపించిన వదంతులపై భారత రక్షణ శాఖ మంగళవారం స్పందించింది. అవన్నీ అబద్ధాలని, సర్జికల్ స్ట్రైక్ చేయలేదని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం ఇద్దరు పాక్ ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) దాటి భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా.. భారత సైనిక దళాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. పాక్ ఉగ్రవాదులు దొరికిపోయిన ప్రాంతంలో జరిపిన సోదాల్లో రెండు మ్యాగజైన్‌లు, రెండు గ్రెనేడ్‌లు, ఏకే 47 రైఫిల్ లభ్యమయ్యాయని  చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌లోని బాలాకోట్ సెక్టార్‌లో ఉన్న ఎల్‌ఓసీ వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని భారత రక్షణ శాఖ తేల్చి చెప్పింది.  దట్టమైన పొగమంచు, అడవుల మాటున ఎగుడుదిగుడుగా ఉన్న కొండచరియల్లో దాక్కుంటూ  బాలాకోట్ సెక్టార్‌లోని హమీర్‌పూర్ ప్రాంతంలోకి వచ్చేటందుకు ఇద్దరు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నించారని వివరించింది.

ఆ న్యూస్ స్టోరీలో ఏముంది ? 

ఓ మీడియా సంస్థ తాజాగా ప్రచురించిన కథనంలో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ పై భారత సైన్యం మరోసారి సర్జికల్ స్ట్రైక్‌ చేసిందని పేర్కొన్నారు. గత శనివారం (ఆగస్టు 19న)  రాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో 2.5 కిలోమీటర్ల  లోపలికి ప్రవేశించి పాకిస్థాన్ ఉగ్రవాదుల నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఆ న్యూస్ స్టోరీలో ప్రస్తావించారు. భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్‌లో ఏడెనిమిది మంది పాక్ ఉగ్రవాదులు మరణించారని అందులో పేర్కొంది. ఈ మిషన్ తర్వాత భారత సైన్యంలోని సైనికులందరూ సురక్షితంగా దేశానికి తిరిగివచ్చారని తెలిపింది.  ఈ కథనాన్ని భారత రక్షణ శాఖ ఖండించింది.