Site icon HashtagU Telugu

I-N-D-I-A : విపక్ష కూటమి పేరు “ఇండియా”.. పీఎం పోస్టుపై ఆసక్తి లేదన్న కాంగ్రెస్

I N D I A

I N D I A

I-N-D-I-A : 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బెంగళూరు వేదికగా సమావేశమైన 26 విపక్ష పార్టీలు కీలక ప్రకటన చేశాయి. 

వాటి కూటమికి  “ఇండియా” (I-N-D-I-A) అని పేరు పెట్టాయి. 

“ఇండియా” అనే దాని ఫుల్ ఫామ్ .. “ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్” అని వెల్లడించాయి. 

 అయితే ఈ పేరులో  ‘అలయన్స్’ అనే పదానికి బదులు ‘ఫ్రంట్’ అనే పదాన్ని చేర్చాలని వామపక్షాలు కోరాయి.

ఇక విపక్షాల కూటమికి అధ్యక్షురాలిగా సోనియా గాంధీని, కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అదనంగా.. విపక్ష కూటమి కోసం రెండు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒక కమిటీ కనీస ఉమ్మడి కార్యక్రమం (ఎజెండా), కమ్యూనికేషన్ పాయింట్‌లను ఖరారు చేస్తుంది. మరో కమిటీ కూటమిలోని పార్టీల  ఉమ్మడి కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలను ప్లాన్ చేస్తుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు  మీటింగ్ కు హాజరయ్యారు. ఇక ‘బీజేపీపై పోరాడే దమ్ము, ధైర్యం ఉన్న అన్ని పార్టీలకు స్వాగతం’ అని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా మంగళవారం కామెంట్ చేశారు.

ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదు : ఖర్గే 

ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఈ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే  చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని చెప్పారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని ఖర్గే చెప్పారు.