Site icon HashtagU Telugu

Ind Vs SL: మరో క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా

Team India New Feb 2

Team India New Feb 2

సొంతగడ్డపై వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోన్న టీమిండియా మరో సిరీస్ విజయంపై కన్నేసింది. శ్రీలంకపై తొలి టెస్ట్ గెలిచిన జోష్‌లో ఇప్పుడు పింక్ బాల్ మ్యాచ్‌లోనూ అదరగొట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ డే నైట్ టెస్ట్ జరగనుంది. లంకపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేకున్నా… అందరి చూపు మాత్రం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కోహ్లీ సెంచరీ చేసి రెండున్నరేళ్ళు దాటిపోయింది. దీంతో ఈ పింక్ బాల్ టెస్టులోనైనా విరాట్ బ్యాట్ నుంచి శతకం ఆశిస్తున్నారు ఫ్యాన్స్‌. నిజానికి కోహ్లీ చివరి శతకం బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులోనే వచ్చిన నేపథ్యంలో లంకపై కూడా సెంచరీ సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. భారత్ తరపున పింక్ బాల్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఇదిలా ఉంటే భారత తుది జట్టు కూర్పు కెప్టెన్ రోహిత్‌శర్మకు తలనొప్పిగా మారింది. మొహాలీ పిచ్‌పై స్పిన్ వ్యూహంతో ఆడిన టీమిండియా ఇప్పుడు డే నైట్ మ్యాచ్ కావడంతో పేసర్లే కీలకం కానున్నారు. దీంతో అదనపు పేసర్‌తో ఆడాల్సి వస్తే సిరాజ్‌కు చోటు దక్కనుండగా.. ఒకవేళ స్పిన్‌ వైపే మొగ్గుచూపితే మాత్రం అక్షర్ పటేల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇక టాపార్డర్, మిడిలార్డర్‌లో మార్పులు ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్‌తో కెప్టెన్ రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. తొలి టెస్టులో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ అదే జోరు కొనసాగిస్తే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయం. దీంతో సారథిగా తొలి టెస్ట్ సిరీస్‌లోనే వైట్‌వాష్ అందుకున్న కెప్టెన్‌గా రోహిత్ రికార్డ్ సృష్టించే అవకాశముంది. మరోవైపు మొహాలీలో పూర్తిగా నిరాశపరిచిన శ్రీలంక ఈ మ్యాచ్‌లోనైనా భారత్‌కు పోటీనివ్వాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ గాడిన పడితే తప్ప లంక పోటీనివ్వడం కష్టమనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో అభిమానులను అనుమతించాలని నిర్ణయించారు. కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో పాటు టిక్కెట్లకు డిమాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డే నైట్ మ్యాచ్ కావడం, కోహ్లీ ఆటను చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడుతున్న నేపథ్యంలో టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.