IND vs AUS 1st Test Match: స్పిన్ ఉచ్చులో విలవిల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి!

అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతున్నారు.

  • Written By:
  • Updated On - February 11, 2023 / 03:21 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అదిరిపోయే విజయంతో ఆరంభించింది. సొంతగడ్డపై మరోసారి పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ నాగ్ పూర్ వేదికగా ఆసీస్ ను చిత్తు చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిలలాడారు. రెండో ఇన్నింగ్స్ లోనూ ఏ మాత్రం క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్ అశ్విన్ తన మ్యాజిక్ చూపించాడు. ఫలితంగా ఆసీస్ ఇన్నింగ్స్ పరాజయం చవిచూసింది.

మూడోరోజు భారత టెయిలెండర్ల బ్యాటింగ్ ఆకట్టుకుంది. రెండోరోజే హాఫ్ సెంచరీ చేసిన అక్షర్ పటేల్ తొలి సెషన్ లో దూకుడుగా ఆడాడు. జడేజా 70 రన్స్ కు ఔటైనా.. మహ్మద్ షమీ సపోర్ట్ తో భారీస్కోరును అందించాడు. ప్రధాన బ్యాటర్ లా ఆడిన మహ్మద్ షమీ కేవలం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 47 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 రన్స్ చేశాడు. షమీ, అక్షర్ 9వ వికెట్ కు 52 పరుగులు జోడించారు. సెంచరీ సాధిస్తాడనుకున్న అక్షర్ పటేల్ 80 పరుగులకు వెనుదిరగడంతో భారత్ 400 రన్స్ కు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 223 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఆసీస్ బౌలర్లలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ మర్ఫీ 7 వికెట్లు పడగొట్టాడు.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలను అశ్విన్ దెబ్బతీశాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 5, ఖవాజా 10 పరుగులకే పెవిలియన్ కు పంపాడు. లబూషేన్ ను జడేజా ఔట్ చేయగా.. తర్వాత ఆసీస్ మిడిలార్డర్ సైతం అశ్విన్ స్పిన్ కు తలవంచింది. రెన్ షా 2, హ్యాండ్స్ కాంబ్ 6, అలెక్స్ క్యారీ 10 , కమ్మిన్స్ 1 పరుగుకే ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్మిత్ క్రీజులో ఉన్నా టెయిలెండర్లు చేతులెత్తేయంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కు 100 లోపే తెరపడింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఢిల్లీలో ఫిబ్రవరి 17 నుంచి జరుగుతుంది.