Site icon HashtagU Telugu

ODI: తొలి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ

team India

team India

చారిత్రక 1000వ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ కూడా ఎదురుకాని వేళ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో చాహల్, వాషింగ్టన్ సుందర్ చెలరేగితే… బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసాడు.
సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిన వేళ విండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనవిజయంతో ఆరంభించింది. కేవలం టీ ట్వంటీ ఫార్మేట్‌కే బాగా అలవాటు పడిన కరేబియన్ టీమ్ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. ఆరంభం నుండే ఈ వన్డే పూర్తి వన్‌సైడ్‌గా మారిపోయింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 176 పరుగులకే పరిమితమైంది. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ టాపార్డర్, మిడిలార్డర్‌లో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. ఒక దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో వందైనా చేస్తుందా అనిపించింది. అయితే జాసన్ హోల్డర్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌తో విండీస్ మంచి స్కోరే సాధించగలిగింది. మరో బ్యాటర్ ఫాబియన్ అలెన్‌తో కలిసి జట్టు స్కోరును 160 దాటించాడు. హోల్డర్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాక.. విండీస్ ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. 4 వికెట్లు తీసిన స్పిన్నర్ చాహల్ 100 వికెట్లు మైలురాయి అందుకున్నాడు.
ఛేజింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. విండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్, కోహ్లీ, పంత్ స్వల్ప వ్యవధిలో ఔటైనా… టార్గెట్‌ పెద్దది కాకపోవడంతో విజయం కోసం భారత్ పెద్దగా శ్రమపడలేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 60 పరుగులు చేయగా.. సూర్యకుమార్ , దీపక్ హుడా జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో 28 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చారిత్రక 1000వ వన్డేలో గ్రాండ్ విక్టరీ అందుకోవడంతో సోషల్ మీడియాలో టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. సిరీస్‌లో రెండో వన్డే బుధవారం అహ్మదాబాద్‌లోనే జరుగుతుంది.