T20 Ind Vs SL: తొలి టీ ట్వంటీలో భారత్ గ్రాండ్ విక్టరీ

శ్రీలంకతో సిరీస్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ ఎదురు కాని వేళ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

  • Written By:
  • Updated On - February 24, 2022 / 11:12 PM IST

శ్రీలంకతో సిరీస్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ ఎదురు కాని వేళ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు మెరిపిస్తే… బౌలింగ్ లో భువనేశ్వర్ రాణించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్సే హైలెట్ గా నిలిచింది.

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి లంక బౌలర్లను ఆటాడుకున్న ఇషాన్ కిషన్ భారీ షాట్లతో అలరించాడు. అటు రోహిత్ కూడా దూకుడుగానే ఆడడంతో భారత్ స్కోర్ బోర్డు ఫస్ట్ గేర్ లో సాగింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 11.5 ఓవర్లలోనే 111 పరుగులు జోడించారు. రోహిత్ 44 పరుగులకు ఔటవగా… ఇషాన్ కిషన్ , శ్రేయాస్ అయ్యర్ తో కలిసి దూకుడు కొనసాగించాడు. లంక బౌలింగ్ లో ఏ మాత్రం పస లేకపోవడంతో ఇషాన్ కిషన్ 89 రన్స్ చేయగా.. చివర్లో శ్రేయాస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే 57 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 199 పరుగులు చేసింది.

ఛేజింగ్ లోనూ శ్రీలంక ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలి బంతికే భువనేశ్వర్ బౌలింగ్ లో వికెట్ చేజార్చుకున్న లంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అసలంక తప్పిస్తే… మిగిలిన వారంతా విఫలమయ్యారు. అసలంక హాఫ్ సెంచరీతో పోరాడడంతోనే లంక స్కోర్ 130 పరుగులైనా దాటగలిగింది.

లంక బ్యాటర్లను భారత బౌలర్లు ఏ దశలోనూ క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 2 , వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో రోహిత్ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో రెండో టీ ట్వంటీ శనివారం ధర్మశాలలో జరుగుతుంది.

Cover Pic Courtesy- BCCI/twitter