Site icon HashtagU Telugu

INDIA Vs NDA – 7 Bypolls : ‘ఇండియా’ వర్సెస్ ‘ఎన్డీయే’ .. తొలిసారి అమీతుమీ.. 7 బైపోల్స్ పోలింగ్ షురూ

India Vs Nda 7 Bypolls

India Vs Nda 7 Bypolls

INDIA Vs NDA – 7 Bypolls : కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’కు, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఇవాళ తొలిసారిగా ఢీకొంటున్నాయి. ఈరోజు 6 రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ స్థానాలకు బై పోల్ జరుగుతోంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్రిపురలో ధన్‌పూర్‌, బోక్సానగర్‌, కేరళ లోని  పుతుపల్లి, జార్ఖండ్‌ లోని దుమ్రి, పశ్చిమ బెంగాల్‌ లోని ధూప్‌గురి, ఉత్తరప్రదేశ్‌ లోని ఘోసి, ఉత్తరాఖండ్‌ లోని బాగేశ్వర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ రోజు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాల్లో ఇండియా కూటమి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు (INDIA Vs NDA – 7 Bypolls) జరగనుంది.

Also read : Teachers Day : ఆచార్య దేవోభవ.. గురువుకు జై

ఉత్తరప్రదేశ్ లోని ఘోసి స్థానంలో ఇండియా వర్సెస్ బీజేపీ.. 

దారా సింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లోని  ఘోసి అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాజీనామా వల్ల ఇప్పుడు అక్కడ బైపోల్ జరుగుతోంది. ఈసారి దారా సింగ్ చౌహాన్ బీజేపీ  తరఫున బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ కొత్త అభ్యర్థి సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. వాస్తవానికి దారా సింగ్ చౌహాన్ గతంలో బీజేపీలోనే ఉండేవారు. గత యోగి సర్కారు మంత్రిగా పనిచేశారు. అయితే 2022 ఫిబ్రవరిలో యూపీ అసెంబ్లీ పోల్స్ జరగడానికి నెల రోజుల ముందు (2022 జనవరిలో) ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. సమాజ్ వాదీ తరఫున ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ సర్కారు ఏర్పడింది. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ బీజేపీ గూటికి చేరారు. ఈక్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బైపోల్ నిర్వహించాల్సి వచ్చింది.

పశ్చిమ బెంగాల్ లోని ధూప్‌గురి త్రిముఖ పోరు..

బెంగాల్‌లోని ధూప్‌గురి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మరణంతో ఇక్కడ బైపోల్ వచ్చింది. ఈ స్థానంలో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్- సీపీఎం కూటమి మధ్య నెలకొంది. 2016లో ఈ స్థానాన్ని టీఎంసీ గెలుచుకోగా, 2021లో బీజేపీ కైవసం చేసుకుంది.

Also read : Today Horoscope : సెప్టెంబరు 5 మంగళవారం రాశి ఫలాలు.. వారు అనవసర వాదనలు పెట్టుకోవద్దు

త్రిపుర లోని ధన్‌పూర్, బోక్సానగర్ ఇండియా వర్సెస్ బీజేపీ

త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న ధన్‌పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాలకు ఇవాళ బైపోల్ జరుగుతోంది. బోక్సా నగర్ లో ఎమ్మెల్యే మరణంతో బైపోల్ వచ్చింది. ఈ స్థానంలో బీజేపీకి చెందిన తఫజ్జల్ హుస్సేన్, కాంగ్రెస్ సపోర్ట్ పొందిన  సీపీఎం అభ్యర్థి మీజాన్ హుస్సేన్‌ తలపడుతున్నారు. ధన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే రాజీనామాతో బైపోల్ వచ్చింది. ఇక్కడ బీజేపీకి చెందిన బిందు దేబ్‌నాథ్‌, కాంగ్రెస్ సపోర్ట్ పొందిన సీపీఎం అభ్యర్థి కౌశిక్‌ దేబ్‌నాథ్‌ల మధ్య పోటీ నెలకొంది.

జార్ఖండ్ లోని డుమ్రిలో ఇండియా వర్సెస్ బీజేపీ  

జార్ఖండ్‌లోని డుమ్రీ అసెంబ్లీ స్థానంలో.. ఎమ్మెల్యే మరణంతో బైపోల్ వచ్చింది. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి బేబీ దేవి,  ఎన్‌డీఏ అభ్యర్థి యశోదా దేవి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.  ఏప్రిల్‌లో మాజీ విద్యాశాఖ మంత్రి, జేఎంఎం ఎమ్మెల్యే జగర్‌నాథ్ మహ్తో మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మహ్తో 2004 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Also read : Check Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే.. తులం ఎంతంటే..?

కేరళలోని పుత్తుపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ వామపక్షాలు

కేరళలోని పుతుపల్లిలో ఎమ్మెల్యే మరణంతో బైపోల్ వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ ఒమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్‌ను రంగంలోకి దింపింది. డీవైఎఫ్‌ఐ నాయకుడు జైక్ సి థామస్‌ ను అధికార వామపక్షాలు పోటీకి నిలిపాయి. బీజేపీ తరఫున పార్టీ కొట్టాయం జిల్లా అధ్యక్షుడు జి లిజిన్‌లాల్‌ పోటీలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

ఎమ్మెల్యే మరణంతో ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో బైపోల్ వచ్చింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార బీజేపీ పార్వతి దాస్‌ను రంగంలోకి దించింది. 2007 నుంచి ఆమె భర్త చందన్ దాస్ వరుసగా నాలుగు ఎన్నికలలో విజయం సాధించారు. ఇటీవల చందన్ దాస్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ తరఫున బసంత్ కుమార్‌ పోటీలో ఉన్నారు.