Uttar Pradesh: ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన అధికారులు

  • Written By:
  • Publish Date - December 24, 2021 / 02:51 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు షాక్ అయ్యారు. కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్‌ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రాగా.. ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్‌ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్‌ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. నిన్న సాయంత్రం నుంచి ఈ లెక్కింపు కొనసాగగా.. శుక్రవారం ఉదయం నాటికి రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. పీయూష్‌ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.

పీయూష్‌ జైన్‌ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ పేరుతో పీయూష్‌ ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఎస్పీపై భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. నోట్ల కట్టలను అధికారులు లెక్కిస్తున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.