చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి రూ.1 లక్ష సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న మంచిర్యాలలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జూన్ 6 నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇందుకు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధ్రువీకరణ పత్రాల కోసం క్యూ పెరిగిపోయింది. కాగా, బీసీలకు అందించనున్న రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువు జూన్ 20తో ముగిసింది.
ఇప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి చెక్కులు అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దరఖాస్తు చేసుకోని వారు ఆందోళన చెందవద్దని.. త్వరలోనే తిరిగి రెండో విడత దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కమలాకర్ చెప్పారు. బీసీలకు రూ.1 లక్ష పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి కమలాకర్ అన్నారు. తొలి విడతలోనే ఆర్థిక సాయం అందాలని చాలా మంది లబ్దిదారులు ఆశపడ్డారు.
అయితే ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం, సర్వర్‌లో అప్లికేషన్ అప్‌లోడ్ చేసే సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారు. ప్రభుత్వం దరఖాస్తులకు గడువు పెంచుతుందని అందరూ భావించారు. కానీ, గడువు పెంచబోమని మంత్రి కమలాకర్ చెప్పారు. ఈ పథకం ద్వారా పలు విడతల్లో లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తాము. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు.