కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక బైక్ను ఢీకొట్టడంతో, దాని పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. ఆ బైక్ బస్సు కింద ఇరుక్కుపోయి కొంత దూరం లాక్కెళ్లడంతో నిప్పురవ్వలు చెలరేగి, పెట్రోల్ తోడవ్వడంతో మంటలు మొదలయ్యాయని భావిస్తున్నారు.
ఈ మంటలు ముందు బస్సులోని లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. ఎక్కువ వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో మంటలు మరింత తీవ్రమై, లగేజీ క్యాబిన్ పైనున్న ప్రయాణికుల కంపార్ట్మెంట్లోకి వ్యాపించాయంటున్నారు. ఈ ప్రమాదం వల్ల లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉన్న సీట్లలో, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. అందుకే బస్సు ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. ప్రమాద స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన తర్వాత ఈ విషయాలను ప్రస్తావించారు.
లగేజీ క్యాబిన్లో బ్యాటరీలు పేలడంతో బస్సులో భారీ శబ్దం వచ్చింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి తన సీటు పక్కన ఉన్న కిటికీ డోరులోంచి బయటకు దిగి, బస్సు వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. లోపల చిక్కుకున్న ప్రయాణికులు బయటపడటానికి ప్రయత్నించినా, కుడివైపు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయారు. వాస్తవానికి ప్రయాణికుల బస్సుల్లో మొబైల్ ఫోన్ల వంటి సరకులను తీసుకెళ్లకూడదు. ప్రయాణికుల వాహనాల్లో వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులు రవాణా చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సరకులను లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అంటుకుని, ప్రాణనష్టం పెరుగుతోంది.
