Site icon HashtagU Telugu

Police Drags Bride: పెళ్లి పీటలపై నుంచి నవ వధువుని లాక్కెళ్ళిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Police Drags Bride

Police Drags Bride

మామూలుగా సినిమాలలో పెళ్లి జరుగుతున్న సమయంలో ఆపండి అనే డైలాగ్ బాగా ఫేమస్. తాజాగా కేరళలో కూడా ఇలాంటి సీన్ ఒకటి కనిపించింది. వరుడు మరికొద్ది క్షణాలలో వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి వధువును బలవంతంగా లాకెళ్ళారు. అసలేం జరిగిందంటే.. కేరళలో కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్‌ ప్రేమించుకున్నారు. మతాలు వేరవడంతో కుటుంబసభ్యులు వీరి బంధాన్ని అంగీకరించలేదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆదివారం స్థానిక ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.

సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు ఆలయానికి వెళ్లారు. అల్ఫియాను బలవంతంగా అక్కడి నుంచి కోవలం పోలీస్‌ స్టేషన్‌ను తీసుకొని వెళ్లారు. తాను రానని అల్ఫియా ఎంత మొత్తుకుంటున్న వినిపించుకోకుండా ఆమెను బలవంతంగా ప్రైవేటు వాహనంలోకి ఎక్కించుకొని తీసుకెళ్తుండగా వరుడు అఖిల్‌ ఆమె దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. దీంతో కేరళ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ సంఘటనపై అలప్పుళ జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ..

 

అల్ఫియా కన్పించకుండా పోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని, దానిపై తాము దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి అక్కడకు వెళ్లామని, కోర్టు ఆదేశాల మేరకు ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని తెలిపారు. ఆమె అఖిల్‌ తోనే వెళ్తానని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించిందని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. దీనిపై అల్ఫియా, అఖిల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అఖిల్‌తో కలిసి జీవించడం మా అమ్మానాన్నలకు ఇష్టంలేదు. వారు నన్ను బలవంతంగా తీసుకెళ్లాలి అనుకున్నారు. అందుకే నేను కన్పించట్లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందుకే పోలీసులు నన్ను బలవంతంగా తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. కానీ, నా ఇష్టపూర్వకంగానే అఖిల్‌తో వెళ్లానని నేను కోర్టులో చెప్పాను. దీంతో మమ్మల్ని వారు వెళ్లనిచ్చారు అని అల్ఫియా తెలిపింది. అయితే, పోలీసులు తమతో అమానుషంగా ప్రవర్తించారని, బలవంతంగా ఆమెను లాక్కెళ్లడమే గాక తనను తోసేశారని అఖిల్‌ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆగిపోయిన తమ పెళ్లి మంగళవారం జరగనున్నట్లు అల్ఫియా, అఖిల్‌ చెప్పారు.