Site icon HashtagU Telugu

TSPSC Group-1: గ్రూప్- 1 పరీక్ష రాస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

SSC CHSL Exam 2024

SSC CHSL Exam 2024

ఈ నెల 16న గ్రూప్- 1 పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్ లోడ్ చేసుకొని వివరాలు సరిగ్గా ఉన్నాయా, ఫోటో ఉందా పరీక్ష కేంద్రం ఎక్కడ కేటాయించారు అనే వివరాలు చూసుకొని సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్-1 పరీక్షల నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తెలియ‌జేశారు.

విద్యార్థులు బూట్లు, సాక్స్‌లు కాకుండా చెప్పులు వేసుకొని ప‌రీక్ష‌కు హాజ‌రుకావాలి. మహిళలు ఆభరణాలు లేకుండా హాజరు కావాల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్‌సీ కొత్త నిబంధనల ప్రకారం చేతులకు మెహందీ, టాటూ ఉన్న యెడల అనుమతించరు. గడియారాలు, ఉంగరాలు ఉండకూడదు. హాల్ టికెట్‌తో పాటు పాస్ పోర్టు, పాన్, ఓటరు, ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు.. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. విద్యార్థులు ఉదయం 8. 30 గంటల నుండి 10. 15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.

అంటే ఉద‌యం 10. 15 గంటల తర్వాత ఎవరినీ అనుమతించబోరు. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతంగా డిబార్ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లను ఏ4 సైజులో ప్రింట్ తీసుకుని రావాలని, కలర్ ప్రింట్ అయితే ఇంకా బెటర్ అని తెలిపారు. ఓఎంఆర్ షీట్స్‌పై అభ్యర్థితో పాటు ఇన్విజిలేటర్ సంతకం ఉండాలని, ఫొటో లేకపోయినా, హాల్ టికెట్‌పై సంతకం ప్రింట్ కాకపోయినా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు.

ఓఎంఆర్ నింపేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓఎంఆర్ షీట్ వైట్‌న‌ర్, చాక్ పౌడర్, ఎరైజర్, బ్లేడ్ వంటివి ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాన్ని డిస్ క్వాలిఫైగా పరిగణించనున్నట్టు పేర్కొన్నారు. బుక్‌లెట్ సిరీస్ నంబర్ ఓఎంఆర్‌లో సరిగా నింపాలని, సిరీస్ సరిగా రాసి, వృత్తాల్ని నిబంధనల ప్రకారం నింపకుంటే ఆ ఓఎంఆర్‌ను డిస్ క్వాలిఫై చేస్తార‌ని అధికారులు పేర్కొన్నారు.

ఎగ్జామ్‌కు కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌, టాబ్లెట్, బ్లూటూత్, వాచ్, వాలెట్, హ్యాండ్ బ్యాగులు, రైటింగ్ ప్యాడ్, నోట్స్ వంటివి అనుమతించేది లేద‌ని ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.