Virus Leak: సూడాన్‌లో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. గత పది రోజులుగా ఈ యుద్దం కొనసాగుతోంది. అయితే రెండు వర్గాల మధ్య ఘర్షణ క్రమంలో సూడాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సూడాన్‌లోని సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్‌ను అక్కడి సాయుధ బలగాలు ఆక్రమించుకున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సెంట్రల్ ల్యాబ్‌ను ఆక్రమించుకోవడాన్ని డబ్ల్యూహెచ్‌వో తప్పుబట్టింది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని, ఏదైనా జరిగి ల్యాబ్‌లోని శాంపిల్స్ లీక్ అయితే ప్రపంచానికే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది. పోలియో, మీజిల్స్, అనేక రకాల వైరస్‌లకు సంబంధించిన శాంపిల్స్‌ను సెంట్రల్ ల్యాబ్‌లు భద్రపరుస్తారని, ఒకవేళ ప్రమాదవశాత్తూ అవి బయటకు లీక్ అయితే జీవ వినాశనానికి దారితీస్తాయని తెలిపింది. ఇది మానవాళికి చాలా ప్రమాదకరమని, వీలైనంత త్వరగా బలగాలు అక్కడ నుంచి నిష్క్రమించాలని కోరింది.
సాయిధ బలగాల్లోని ఓ వర్గం సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్‌ను ఆక్రమించిందని, దీని వల్ల జీవసంబంధమైన ప్రమాదం పొంచి ఉందని సూడాన్‌లోని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి సయూద్ అబిద్ కోరారు. ఏదైనా వైరస్ లీక్ అయితే ప్రపంచవ్యాప్తంగా విజృంభించే అవకాశం ఉంటుందని, దీని వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. అనుకోని వైరస్ లు లేదా వ్యాధికారిక జీవాలు బయటకు వస్తే భారీ జీవసంబంధ ప్రమాదం జరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
అయితే ప్రతి దేశంలోనే ఉండే సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీలో గతంలో విజృంభించిన వ్యాధులకు సంబంధించిన వైరస్ శాంపిల్స్ ను భద్రపరుస్తారు. దీని వల్ల వ్యాధులు, వైరస్ లపై పరిశోధనలు చేయడంతో పాటు భవిష్యత్తులో ఏదైనా వైరస్ లు సోకితే వాటిపై రీసెర్చ్ చేసేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఈ ల్యాబ్ ల వద్ద అత్యంత సెక్యూరిటీ ఉంటుంది. వైరస్‌లు బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా ప్రమాదకర వైరస్ లీక్ అయితే వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.