Cases On Ramojirao: మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన.. రామోజీరావు, శైలజాకిరణ్‌లపై కేసులు

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL) చైర్మన్ చెరుకూరి రామోజీ రావు (Ramojirao), అతని కోడలు, MCFPL మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ, బ్రాంచ్ మేనేజర్‌లపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (APCID)ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

  • Written By:
  • Publish Date - March 12, 2023 / 11:45 AM IST

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL) చైర్మన్ చెరుకూరి రామోజీ రావు (Ramojirao), అతని కోడలు, MCFPL మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ, బ్రాంచ్ మేనేజర్‌లపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (APCID)ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చిట్ ఫండ్ కంపెనీకి చెందిన వివిధ శాఖలు మోసం చేయడం, డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించడం, క్యాపిటల్ మార్కెట్‌ల నష్టాలు, చిట్ ఫండ్ బిజినెస్ యాక్ట్ ఆరోపణలు ఉన్నాయని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచే మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లపై సీఐడీ సోదాలు చేపట్టినట్టు సీఐడీ అధికారులు ప్రకటించారు.

గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులకు సంబంధించి వివిధ జిల్లాల అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ల నుండి సిఐడి అధికారులకు అనేక ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు తీసుకుంది. IPCలోని 34 సెక్షన్‌లు 120(B), 409, 420, 477(A) రీడ్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల రక్షణ సెక్షన్ 5, చిట్ ఫండ్స్ యాక్ట్ (1982) సెక్షన్ 76, 79 కింద కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో ఏ 1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఏ 2 నిందితులుగా చెరుకూరి శైలాజా కిరణ్, ఏ 3 నిందితులుగా సంబంధింత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేసింది.

Also Read: ED Case on Kavitha: ఈడీ అరెస్ట్ నుంచి కవిత తప్పించుకోలేదా?

చిట్ ఫండ్ వ్యాపారం నియంత్రణ అథారిటీ అయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం గత అక్టోబర్‌లో MCFPL వివిధ శాఖలతో పాటు ఇతర చిట్ ఫండ్ కంపెనీలపై ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సోదాల సమయంలో MCFPL పేరుతో ఉన్న బహుళ టిక్కెట్‌లకు సంబంధించి నెలవారీ వాయిదాలను చెల్లించకపోవడం, కొత్త చందాదారులతో భర్తీ చేయడం, ఆదాయ, వ్యయాల ఖాతా స్టేట్‌మెంట్‌ను వెల్లడించకపోవడం వంటి అనేక అక్రమాలను అధికారులు గుర్తించారు. ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయనే విషయాన్ని సీఐడీ వెల్లడించలేదు. ఏఏ నగరాల్లో బ్రాంచీపై కేసులు నమోదు చేశారనే విషయాన్ని సీఐడీ వివరించింది. విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అదే సమయంలో నర్సరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచీల ఫోన్‌మెన్ పరారీలో ఉన్నారని సీఐడీ తెలిపింది.