World Cup 2023: చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలిపోయింది. 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 199కి ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ లో రోహిత్ కెప్టెన్సీ, స్పిన్నర్లు రెచ్చిపోగా, పేసర్లు శుభారంభం అందించారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ బుమ్రా బౌలింగ్ లో జీరో పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. బుమ్రా బౌలింగ్ లో మార్ష్ విరాట్ కోహ్లీకి క్యాచ్ అందించి డకౌట్ తో వెనుదిరిగాడు. డేవిడ్ వార్నర్ జట్టు బాధ్యతను తీసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్, వార్నర్ కలిసి ఆస్ట్రేలియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో స్టీవ్ స్మిత్ రాణించాడు. 71 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 46 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆసీస్ స్కోర్ బోర్డు ఫర్వాలేదనిపించింది.
జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. 27.1వ బంతికి స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 30వ ఓవర్లో లబుషేన్, అలెక్స్ కేరీ ని పెవిలియన్‌కు పంపించాడు. మిగతా బౌలర్లు సైతం వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. 30 ఓవర్లు ముగిసే సరికి కంగారూలు 5 వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. దీంతో 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి 199కి ఆలౌట్ అయింది రవీంద్ర జడేజా (3/28), జస్ప్రీత్ బుమ్రా (2/35), కుల్‌దీప్ యాదవ్ (2/42) సమష్టిగా కంగారూలను దెబ్బకొట్టారు.
Also Read: World Cup 2023: ప్రపంచ కప్ లో డేవిడ్ భాయ్ 1000 పరుగులు