Site icon HashtagU Telugu

T20 Ranking: టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత్ క్రికెటర్ల జోరు

Team India vs WI

Team India vs WI

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో టీమిండియాస్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాద‌వ్‌, యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌లు దుమ్మురేపారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌లోఅత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకోగా, వెంకటేష్ అయ్యర్ ఏకంగా 203 స్థానాలు ఎగబాకి 115వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో పోరాడిన విండీస్ వీరుడు నికోలస్ పూరన్ కూడా ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని 13వ ర్యాంకులో నిలిచాడు.. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 10వ స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు.

విండీస్ తో సిరీస్ లో 3 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 92 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అఖరి టీ ట్వంటీలో 19 బంతుల్లో 35 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు కూడా తీశాడు.. అంతకుముందు తొలి టీ ట్వంటీలో ఇన్నింగ్స్‌ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌.. 13 బంతుల్లో 24 పరుగులతో రాణించాడు.అలాగే రెండో టీ20లో కూడా 18 బంతుల్లో 33 పరుగులు కూడా సాధించాడు.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ విండీస్‌తో టి ట్వంటీ సిరీస్‌లో విశేషంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్ కు సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.