ఆస్ట్రేలియాలో జరిగే పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కరోనాకి సంబంధించిన నిబంధనలను సడలించింది. కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఆటగాళ్లు క్రికెట్ ఆడవచ్చు. ఈ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ICC కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది. టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్ తప్పనిసరి కాదన్న ఐసీసీ.. ఒకవేళ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినా ఐసోలేషన్ లో ఉండనవసరం లేదని పేర్కొంది. అయితే ఆటగాడి ఆరోగ్య పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడాలా.. వద్దా నిర్ణయించుకునే అవకాశాన్ని జట్టుకే వదిలేసింది.
2021 UAEలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా టైటిల్‌ను కైవసం చేసుకున్నప్పుడు కఠినమైన బయో సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ టీ20 ప్రపంచకప్ ఓ స్పెషల్ రికార్డు సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటివరకు ఏ క్రికెట్ ఈవెంట్ కూడా ఇన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం. అదే విధంగా మ్యాచ్ హైలెట్స్‌ను T20worldcup.com, టీ20 వరల్డ్ కప్ యాప్‌లో గానీ ఫాన్స్ వీక్షించవచ్చు. నేటి నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి