School Fees: ఇబ్రహీంపట్నంలో దారుణం.. ఫీజుల కోసం విద్యార్థులకు దండన

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 03:46 PM IST

School Fees: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఫీజుల కోసం విద్యార్థులకు దండన విధించింది. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడం లేదంటూ విద్యార్థులపై తమ ప్రతాపం చూపెట్టింది. ఉదయం మంచాల మండలం, యాచారం మండలంలోని పలు గ్రామాల నుంచి విద్యార్థులకు బస్సల్లో పాఠశాలకు తీసుకొచ్చారు. ఆ విద్యార్థుల్లో ఫీజులు చెల్లించని వారిని పార్కింగ్ స్థలంలో ఉన్న బస్సుల్లోనే యాజమాన్యం కూర్చోబెట్టింది. విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా నిలిపివేశారు.

మీడియాకు విషయం తెలియడంతో… సదరు విద్యార్థులను తిరిగి తరగతులకు పంపించారు. ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినకుండా విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా ఏటా హైదరాబాద్ పాఠశాలల్లో 10-12 శాతం ఫీజులు పెంచుతున్నారు. గణనీయమైన వార్షిక రుసుములతో పాటు, ఈ పాఠశాలలు పాఠ్యేతర ఫీజులు, లైబ్రరీ ఫీజులు మరియు ల్యాబ్ ఫీజులు వంటి అదనపు ఛార్జీలను విధిస్తాయి. మార్కెట్ రేట్లకు అనుగుణంగా సిబ్బంది జీతాలు పెంచాల్సిన అవసరాన్ని పేర్కొంటూ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పెంపును సమర్థించుకుంటుండటం గమనార్హం.