IAS Officer: కీర్తి జల్లి ఐఏఎస్..తెలంగాణ బిడ్డ..ఎందుకంత వైరల్ అవుతోంది..!!

ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ ఎత్తున వరదలు సంభవించాయి. దాదాపు 30మందిని బలిగొన్నాయి. లక్షలాది మంది ప్రజలను నిరాశులని చేసాయి.

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 07:10 AM IST

ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ ఎత్తున వరదలు సంభవించాయి. దాదాపు 30మందిని బలిగొన్నాయి. లక్షలాది మంది ప్రజలను నిరాశులని చేసాయి. వరద బాధితుల కోసం అసోం ప్రభుత్వం పెద్దెత్తున సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఓ మహిళా IASఅధికారి పేరు ఇప్పుడు వైరల్ గా మారింది.

IASఅధికారిణి కీర్తి జల్లి..తెలంగాణ బిడ్డ. అసోంలో ఓ జిల్లాకు కలెక్టర్. వరదల సందర్భంగా కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలిస్తూ, సమీక్షలు జరిపి సరిపెట్టుకోవచ్చు. కానీ కీర్తి జల్లి అలా కాదు. తానే స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవడమే కాదు..వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎంతో శ్రమిస్తున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చీరకట్టులో, మోకాళ్ల లోతు బురద నీటిలో ఆమె ఇంటింటికి తిరుగుతూ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నిరాశ్రయులను స్వయంగా పడవపై పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ఓ గ్రామంలో ప్రజలు ఆమె కలెక్టర్ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. వరదలు రావడం తమకు కొత్తేమీ కాదని, వరదలు వచ్చినప్పుడు కలెక్టర్ రావడమే తమకు కొత్తగా ఉందని ఆ గ్రామ ప్రజలు వ్యాఖ్యానించారు.

కాగా కీర్తి జల్లి స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా. 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది, ఢిల్లీలో కోచింగ్ తీసుకుని సివిల్స్ రాశారు. 2013లో నేషనల్ లెవెల్లో 89వ ర్యాంకు
సాధించింది కీర్తి. శిక్షణ అనంతరం కలెక్టరుగా అసోంలో విధుల్లో చేరారు.

కాగా, 2016లో అసోంలో జరిగి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి ప్రజలను ప్రభావితం చేసింది. ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునే దిశగా కొత్త రీతిలో ప్రోత్సహించారు కీర్తి. ‘భోని’ అనే బొమ్మలను తయారు చేయించి పోలింగ్ కేంద్రాల సమీపంలో ఏర్పాటు చేశారు. అసోంలో చిన్న చెల్లెల్ని ‘భోని’ అంటారు. అసోం సంస్కృతిలో చిన్న చెల్లెలికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వారి సెంటిమెంట్ ను పసిగట్టిన కీర్తి జల్లి ‘భోని’ బొమ్మల సాయంతో వారి నుంచి సత్ఫలితాలు రాబట్టింది. ఆమె ప్రయత్నం ఫలించింది., మహిళా ఓటర్లు గణనీయ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కీర్తి జల్లి ప్రయత్నం ఎన్నికల సంఘాన్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమెకు ‘బెస్ట్ ఎలొక్టరల్ ప్రాక్టీసెస్’ అవార్డును అందించారు.

హైలాకండి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కీర్తి…మహిళలు, చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించించిది. వారికోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉసిరి, బెల్లం కలిపిన ఉసిరి మురబ్బా తయారు చేయించి మీర స్వయంగా మహిళలకు పంపిణీ చేశారు. కీర్తి జల్లి ప్రయత్నం ఫలించింది. వారి ఆరోగ్యం మెరుగుపడింది. ఇవే కాదు, కీర్తి జల్లి ఉద్యోగ ప్రస్థానంలో ఇలాంటివి ఎన్నో విజయాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆమె ఉద్యోగ నిబద్ధత ఎలాంటిదంటే… కనీసం తన పెళ్లి రోజున కూడా ఆమె సెలవు పెట్టలేదట. అర్థం చేసుకోవచ్చు ఆమె గురించి.