Site icon HashtagU Telugu

Jagan and Chandrababu: జ‌గ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య హైడ్రామా

Check your Vote

Jagan chandrababu naidu

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కేంద్రబిందువుగా సీఎం జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మ‌ధ్య హైడ్రామా న‌డిచింది. రెప్ప‌పాటు త‌ప్పుజ‌ర‌గ‌కుండా ప్రోటోకాల్ ను ఏపీ పోలీసులు చాక‌చ‌క్యంగా నిర్వహించారు. లేదంటే గంద‌ర‌గోళం ఏర్ప‌డేది. ఇంత‌కూ ఏమి జ‌రిగిందంటే, విజ‌య‌వాడ నోవాటెల్ హోట‌ల్ లో చీఫ్ జ‌స్టిస్ బ‌స చేశారు. ఆయ‌నకు ఉన్న బిజీ షెడ్యూల్ రీత్యా నిమిషాల వ్య‌వ‌ధిలోనే జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు అపాయిట్మెంట్ దొరికింది. దీంతో అక్క‌డ సినిమాల్లో క్లైమాక్స్ సీన్ మాదిరిగా హై టెన్ష‌న్ నెల‌కొంది.

సీఎం జగన్ ను సెల్లార్ మార్గం ద్వారా వెళ్లి సీజేఐ ఎన్వీ రమణను కలిసి అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయేలా పోలీసులు ప్లాన్ చేశారు. అదే సమయంలో వచ్చిన చంద్రబాబు ను నోవోటెల్ హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా వెళ్లి సీజేఐని కలిసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ ఎక్కడా ఎదురుపడకుండా పోలీసులు జాగ్ర‌త్త ప‌డ్డారు. దీంతో ఎవరికి వారు సీజేఐని కలిసి వెళ్లిపోయారు. అనంతరం సీజేఐ కూడా కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లిపోయారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నోవాటెల్ హోటల్లో ఉన్న సీజేఐ ఎన్వీ రమణతో భేటీ కోసం ముందుగా జగన్ చేరుకున్నారు. ఆయన వెళ్లిపోక ముందే చంద్రబాబు అక్కడికి వచ్చారు. వీరిద్దరూ సీజేఐని కలిసేందుకు పోలీసులు, ప్రోటోకాల్ అధికారులు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఏ ఒక్కరూ సీజేఐని కలవలేకపోయినా, ఇబ్బందులు కలిగించినా ఎన్వీ రమణ ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు టెన్షన్ పడాల్సి వచ్చింది.

ఏపీ రాజ‌కీయాల్లో ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గ‌మ‌నేలా సీఎం, ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ధ్య వైరం కొన‌సాగుతోంది. చంద్రబాబు అధికారంలో ఉండ‌గా అసెంబ్లీలో పలకరింపులు తప్పితే బయట వీరిద్దరూ ఎదురుప‌డేందుకు ఇష్ట‌ప‌డేవాళ్లు కాదు. తాజాగా రాజ్ భవన్లో గవర్నర్ హరిచందన్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ `ఎట్ హోం` కార్యక్రమంలో జగన్, చంద్రబాబు ఇద్ద‌రూ వెళ్లిన‌ప్ప‌టికీ ఎడ‌మొఖంపెడ‌మొఖంగా ఉన్నారు. అసెంబ్లీ లోపల మాత్రం వీళ్లిద్ద‌రూ ముఖాముఖి మాట్లాడుకునే వాళ్లు. ఒక వేదిక‌పైకి రావ‌డానికి ఏ మాత్రం జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌డంలేదు. అందుకే, బీమ‌వ‌రంలో జరిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, ఎట్ హోం, ఆజాదీకీ అమృత‌మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాల్లో ఇద్ద‌రూ క‌లిసి పాల్గొన‌లేక‌పోయారు. రాజ‌కీయ వైరంతో పాటు వ్య‌క్తిగ‌త వైరం వీళ్లిద్ద‌రి మ‌ధ్యా పెరిగింది. ఫలితంగా శ‌నివారంనాడు నోవాటెల్ హోటల్ కేంద్రంగా పోలీసులు హైరానా ప‌డాల్సి వ‌చ్చింది.