Hyderabad Rains: మూసీ ముంచేసింది!

వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది.

  • Written By:
  • Updated On - July 27, 2022 / 12:33 PM IST

వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినా.. ఇంట్లోని విలువైన సామాగ్రి వరద తాకిడికి కొట్టుకుపోయింది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్‌లోని మరిన్ని గేట్లను తెరవాలని అధికారులు నిర్ణయించడంతో మంగళవారం మూసీ నదిలో నీటిమట్టం పెరిగింది. రిజర్వాయర్‌లోని అదనపు నీటిని 12 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. మూసీ నదిలోకి భారీగా నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నది పక్కనే ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఆ ప్రాంత వాసులను ఫంక్షన్‌ హాల్‌కు తరలించినా.. వారి సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలువురు వరద బాధితులు మాట్లాడుతూ.. 2BHK పథకం కింద ఇళ్లను పొందుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, అయినప్పటికీ వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదని చెప్పారు.

పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌ దారులు బంద్

మూసీ నదిలో నీటిమట్టం పెరగడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌ వంతెనలను మూసివేయాలని నిర్ణయించారు. అంతకుముందు మూసీ నదిలో వర్షపు నీరు ఎక్కువగా రావడంతో మూసారాంబాగ్ వంతెనను మూసివేశారు. వంతెనపైకి వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు వేశారు.

ఇదీ.. ప్రస్తుత పరిస్థితి

మంగళవారం ఉస్మాన్‌ సాగర్‌లో ఫుల్‌ ట్యాంక్‌ మట్టం 1790 అడుగులకు గాను 1787.55 అడుగులకు చేరుకుంది. 15 గేట్లకు 12 ఎత్తివేయడంతో జలాశయం నుంచి ఔట్ ఫ్లో 7308 క్యూసెక్కులుగా నమోదవుతుండగా, ఇన్ ఫ్లో 6800 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు, హిమాయత్ సాగర్ పూర్తి ట్యాంక్ లెవల్ 1763.50 అడుగులకు గాను 1761.25 అడుగుల నీటిమట్టం ఉంది. 17 గేట్లలో ఆరు ఎత్తివేత తరువాత, రిజర్వాయర్‌లోని నీటి అవుట్‌ఫ్లో 5780 క్యూసెక్కులుగా నమోదైంది.