Vehicles Honking: హారన్ కొడితే.. ఫైన్ పడుద్ది!

ఇష్టానుసారంగా హారన్లు కొడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వాహనదారులకు చెక్ పెట్టే పరిజ్ఞానం

  • Written By:
  • Updated On - April 21, 2022 / 02:14 PM IST

ఇష్టానుసారంగా హారన్లు కొడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వాహనదారులకు చెక్ పెట్టే పరిజ్ఞానం మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చేతికొచ్చింది. ఇంతకీ ఎడాపెడా హారన్లను మోగించే వాహనదారులను ఎలా గుర్తిస్తారని అనుకుంటున్నారా !! దీనికి సమాధానం ” అకౌస్టిక్ కెమెరాలు ” !! కెమెరాలేంటి.. హారన్లను గుర్తించడమేంటి !! అనే ప్రశ్న మీ మెదడులో ఉదయించిందా .. అయితే దానికి కూడా సూటిగా సుత్తి లేని సమాధానం ఒకటి ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా హారన్లు మోగే వైపు ” అకౌస్టిక్ కెమెరాల “తో షూట్ చేస్తే చాలు.. నిర్దేశిత పరిమితికి మించి ఏ వాహనం హారన్ మోగిస్తోందో.. కెమెరా కళ్లు గుర్తిస్తాయి.

వెంటనే ఆ వాహనం నంబరు పేరిట చాలాన్ కూడా జారీ చేస్తాయి. ఈ టెక్నాలజీని జర్మనీ కి చెందిన Acoem Group అభివృద్ధి చేసింది. తాజాగా బుధవారం రోజున దీనితో హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై ట్రయల్ రన్ నిర్వహించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఏ.వీ.రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. కాగా, ఈ ట్రయల్ రన్ కు ముందు అకౌస్టిక్ కెమెరాల వినియోగంతో ముడిపడిన సాంకేతిక, న్యాయపరమైన పరిమితులపైనా ఏ.వీ.రంగనాథ్ సమీక్షించారు. హారన్ మోగించేప్పుడు కంట్రోల్ లో ఉండండి మరి!!