Site icon HashtagU Telugu

TRS MLA Jeevan Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

Jeevan Reddy

Jeevan Reddy

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. ఒకప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితమయ్యే రాజకీయాలు ఏకంగా హత్య రాజకీయాలకు దారితీస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందనే వార్తలు మరువక ముందే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నం జరిగిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తి, పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఆర్మూర్‌లోని మాక్లూర్‌ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్తగా గుర్తించారు. నిందితుడి (ప్రసాద్ గౌడ్) భార్య (లావణ్య) ఇటీవల సర్పంచ్ పదవి నుండి సస్పెండ్ చేయబడింది. దీంతో ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై విద్వేషం పెంచుకున్నట్టు సమాచారం. ప్రసాద్ గౌడ్ అనుమానాస్పద కదలికలను గమనించిన ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version