తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSRTC ని ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటుంటే..బస్సు ప్రయాణికులు మాత్రం మా జేబులకు చిల్లులు పడ్డాయని గగ్గోలు పెడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో TSRTC ని ప్రభుత్వంలో కలపడం ఒకటి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలంటూ 2019 సమ్మె సందర్భంగా కార్మికులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వారికిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబరాలు చేసుకుంటూ సీఎం కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు తెలిపి 24 గంటలు కాకముందే సిటీలో డే పాస్ ధరలు పెంచి ప్రయాణికుల జేబును ఖాళీ చేసారు. నిన్నటి వరకు సిటీ లో డే పాస్ (TSRTC Bus Day Pass) ధర రూ.100గా ఉండగా.. ఈరోజు (మంగళవారం) నుంచి డే పాస్ ధర రూ.120కు పెంచింది టీఎస్‌ఆర్టీసీ.
ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ప్రకటించిన మరుసటి రోజే డేపాస్ ధరలను పెంచడం ఫై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలకు పెరిగింది. అయితే, రూ.80 , రూ. 100గా ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. 120 రూపాయలు డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్ముడు అవుతున్నాయని.. అదే 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకు అమ్మకాలు జరిగాయని అంటున్నారు. ప్రయాణికులు కూడా డే పాస్ ధర తక్కువ ఉండడం తో తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు ధర పెరగడం తో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Eye Conjunctivitis: కలకలం రేపుతున్న కండ్లకలక, రోగుల రద్దీతో ఆస్పత్రులు ఫుల్!