Site icon HashtagU Telugu

Tirupati Murder Case: భార్యను హత్య చేసి.. శవాన్ని సూట్‌కేస్‌లో దాచిపెట్టి!

Murder

Murder

భార్యను దారుణంగా హత్య చేసి శవాన్ని సూట్‌కేస్‌లో దాచిపెట్టి తిరుపతిలోని చెరువులో భర్త పడేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేణుగోపాల్‌కు కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే పద్మ త‌న‌ భర్త వేధింపులకు గురైంది. వేణుగోపాల్ వేధింపులు భరించలేక పద్మ స్వగ్రామానికి వెళ్లి భర్త నుంచి విడాకులు కోరింది. ఈ క్రమంలో కుటుంబ పెద్దలంతా కలిసి భార్య, భర్తలను కలిపే ప్రయత్నం చేసి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు.

భర్త వేధింపులను గుర్తుచేసుకున్న పద్మ.. కుటుంబసభ్యుల వేడుకోలు వినలేకపోయింది. ఈ క్రమంలో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాడిస్టు భర్త పద్మను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీలోని చేపల చెరువులో పడేశాడు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింద‌ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని చెరువులో సోదాలు చేపట్టారు. ఈతగాళ్ల సాయంతో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘ‌న‌ట‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.