Heat Wave: వడదెబ్బ తగలకుండా సేఫ్‌గా ఉండడం ఎలా?

వడదెబ్బతో గత 3 రోజుల్లో 98 మంది దాకా మరణించినట్టు వార్తలొస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Election In Extreme Heat

Hot Summer 2

వడదెబ్బతో గత 3 రోజుల్లో 98 మంది దాకా మరణించినట్టు వార్తలొస్తున్నాయి. వడదెబ్బ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారు 400 మంది ఆసుపత్రుల్లో చేరారు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రానున్న నాలుగైదు రోజుల్లో ఎండ, వడగాలులు ఉంటాయని ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరి ఇలాంటి టైంలో వడదెబ్బ తగలకుండా సేఫ్‌గా ఉండడం ఎలా?

వడదెబ్బ చాలా ప్రమాదకరమైనది. తక్కువ టైంలో ఇది ప్రాణాలు తీసేస్తుంది. అయితే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడొచ్చు. బయట వేడి తాకిడికి శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి, శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పడమే వడదెబ్బ అంటే. వడదెబ్బ తగిలినప్పుడు శరీరం నుంచి చెమట రావడం ఆగిపోతుంది. పల్స్ వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడు కంట్రోలో ఉండవు. కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మం పొడిబారుతుంది కూడా. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన కేర్ తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది.

సాధారణంగా ఐదేళ్ల లోపు పిల్లలకు, వయసుపైబడిన వాళ్లకు ఎండదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. అలాగే ఎండలో పనులు చేసేవాళ్లు, అథ్లెట్లు, క్రానిక్ డిసీజ్‌లతో బాధపడుతున్నవాళ్లకు కూడా ప్రమాదం ఎక్కువ. ఇలాంటి వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే వెంటనే ఆ వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని చల్లటి నీటితో లేదా ఐస్ ముక్కతో తుడవాలి. నీళ్లు లేదా నిమ్మరసం తాగించాలి. లేట్ చేయకుండా డాక్టర్‍ దగ్గరకు తీసుకెళ్లాలి.

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.

ఎండ ఎక్కువగా ఉండే టైంలో.. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలోతిరగకపోవటం బెటర్.

ఎండాకాలం నూనె పదార్థాలు తినడం తగ్గించాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, పళ్లరసాలు తాగుతుండాలి.

బయటకు వెళ్లేటప్పుడు చెమటను పీల్చుకునే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.

  Last Updated: 20 Jun 2023, 02:49 PM IST